వచ్చే ఏప్రిల్ నుంచి మిగిలిన అన్ని జిల్లాల్లోనూ నాణ్యమైన, ప్యాకేజ్డ్ బియ్యాన్ని పంపిణీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. సంబంధిత శాఖ మంత్రి కొడాలి నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం అమలవుతున్న నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ పైలెట్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి తొలుత సమీక్షించారు. దీనికి సంబంధించిన పలు వివరాలను అధికారులు సీఎంకు నివేదించారు. నాణ్యమైన, ప్యాకేజ్డ్ బియ్యంపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ బాగుందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. రైతుల నుంచి బియ్యం సేకరణ, ప్యాకేజ్డ్ యూనిట్ల ఏర్పాటు, గిడ్డంగుల్లో బియ్యాన్ని భద్రపరుస్తున్న తీరు తదితర అంశాలను సమీక్షించారు. ఎక్కడా అలసత్వానికి దారి తీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదని స్పష్టం చేశారు. బియ్యాన్ని పంపిణీ చేస్తున్న ప్లాస్టిక్ బ్యాగులను తిరిగి వెనక్కి ఇచ్చేసేలా అవగాహన కల్పించాలని లేకపోతే ఆ బ్యాగుల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని సూచించారు.
నాణ్యమైన బియ్యం.. ఇక మీ ఇంటికే! - cm jagan latest news
వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకూడదని స్పష్టం చేశారు. ప్రతి లబ్ధిదారుడి ఇంటికే బియ్యాన్ని సరఫరా చేయాలని చెప్పారు.
సీఎం జగన్