filing private complaint without allowing the CBI officer: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు పిలిస్తే.. దర్యాప్తు అధికారి, సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై ప్రైవేటు ఫిర్యాదులు దాఖలు చేస్తున్నారని సీబీఐ తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) హరినాథ్ హైకోర్టుకు వెల్లడించారు. పులివెందులకు చెందిన వెంకట కృష్ణారెడ్డి, అనంతపురం జిల్లా యాడికి వాసి గంగాధర్‌రెడ్డిలు.. సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై దిగువ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదులు వేశారన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వివేకా హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగదన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకొని గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా ఏఎస్పీ రామ్‌సింగ్‌పై ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని వేసిన వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని కోరారు.
దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు. వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని తనను సీబీఐ ఏఎస్పీ బెదిరిస్తున్నారంటూ గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి కడప ఫస్ట్‌క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్/ స్పెషల్ మొబైల్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసి, నివేదిక సమర్పించాలని మేజిస్ట్రేట్ కోర్టు దాన్ని ఠాణాకు రిఫర్ చేసింది. రిమ్స్ ఠాణా పోలీసులు సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై ఐపీసీ సెక్షన్ 195ఏ, 323, 506, రెడ్‌విత్ 34 కింద కేసు నమోదు చేశారు. దీన్ని కొట్టేయాలని రామ్‌సింగ్ హైకోర్టును ఆశ్రయించగా... ఈ కేసులో తదుపరి చర్యలన్నింటిని నిలిపేస్తూ ఫిబ్రవరిలో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సోమవారం ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చింది.
తీర్పు దస్త్రాల అదృశ్యంపై హైకోర్టు విస్మయం