'స్టే ఎత్తివేశాకే పోలవరం నిర్మాణ పనులు అప్పగింత' త్వరగా పనులు పూర్తి చేయండి...
ముఖ్యకార్యనిర్వహణాధికారి ఆర్కేజైన్ అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగిన పోలవరం అథారిటీ సమావేశం ముగిసింది.సమావేశంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సహా ఇంజనీర్లు,అధికారులు పాల్గొన్నారు.రీటెండరింగ్ తర్వాత హెడ్‌వర్క్స్ పనుల తీరుపై సమావేశంలో చర్చించామన్న బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండే...త్వరగా పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపారు.హైకోర్టు స్టే ఉన్నందున పనులను అప్పగించలేమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఏకి వివరించిందన్నారు.
హైకోర్టులో స్టే ఎత్తివేశాకేపనులు
స్టే ఎత్తివేత కోసం ప్రయత్నిస్తున్నామని,వీలైనంత త్వరగా పనులు అప్పగిస్తామని అధికారులు పీపీఏకు తెలిపారు.ప్రాజెక్టు ఆమోదిత డిజైన్లు,పనుల పురోగతితో పోలిస్తే..రీటెండరింగ్‌లో పేర్కొన్న పనుల పరిమాణం వేర్వేరుగా ఉన్నాయని...ఒప్పందం సమయంలో అన్నింటినీ సరిచేయాలని సూచించినట్లు సభ్యకార్యదర్శి బి.పి.పాండే చెప్పారు.నిపుణుల కమిటీ పరిశీలనలపైనా సమావేశంలో చర్చించామన్న ఆయన...కమిటీ పరిశీలనలపై ప్రభుత్వం ఇచ్చిన వివరణను కేంద్ర జలశక్తి శాఖకు నివేదించామని అన్నారు.కేవలం ప్రాథమిక పరిశీలనలే అయినందున పూర్తిస్థాయిలో సాంకేతికపరమైన పరిశీలన చేపట్టాల్సిన అవసరం ఉందని అథారిటీ తెలిపింది.
అత్యంత ప్రాధాన్యంగాపునరావాస పనులు
విజిలెన్స్ శాఖకు చెందిన ప్రత్యేక నిపుణుల బృందం పూర్తిస్థాయి విచారణ జరుపుతోందని ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమావేశంలో వివరించారని అథారిటీ సభ్యకార్యదర్శి తెలిపారు.హెడ్‌వర్క్స్‌తోపాటు ఇతర పనులపైనా విచారణ జరుగుతుందని ప్రభుత్వం తమకు వివరించిందని చెప్పారు.దీంతో విచారణ చేస్తున్న ప్రత్యేక బృందం వివరాలు ఇవ్వాలని అథారిటీ కోరిందన్న ఆయన...బృందంలో కేంద్ర జలశక్తి శాఖ ప్రతినిధినీ చేర్చాలని కోరినట్లు తెలిపారు.పోలవరం ప్రాజెక్టు డంపింగ్ సైట్ల వల్ల పర్యావరణం దెబ్బతింటుందన్న పిటిషన్లకు సంబంధించి..ప్రభుత్వం ఇచ్చిన నివేదికను జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు నివేదిస్తామని చెప్పారు.పునరావాస పనులను అత్యంత ప్రాధాన్యంగా చేపట్టాలని... 2020మే నెలాఖరు వరకే పూర్తి చేయాలని సూచించినట్లు చెప్పారు.
కాఫర్ డ్యాంలో మిగిలిన పనులను వీలైనంత త్వరగా ప్రారంభించి,మే2020కల్లా పూర్తి చేయాలని సూచించినట్లు అథారిటీ సభ్యకార్యదర్శి తెలిపారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు త్వరగా వచ్చేలా చూడాలని ప్రాజెక్టు అథారిటీని ప్రభుత్వం కోరింది.