Power cuts Problems: రాష్ట్రంలో విధిస్తున్న విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయట చూస్తే ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో చూస్తే కరెంటు లేక, ఫ్యాన్లు తిరగక... ఉక్కపోతలతో ప్రజలంతా అల్లాడిపోతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. రాత్రివేళల్లో సైతం విద్యుత్ కోతలు విధిస్తుండటంతో.. నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీకట్లోనే వంటలు, పిల్లల చదువులు, భోజనాలు ముంగించాల్సిన పరిస్థితి. విద్యుత్ పై ఆధారపడిన జిరాక్స్ కేంద్రాలు, శీతల పానీయాల దుకాణాలు మూతపడుతున్నాయి.
Power cuts Problems: విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ప్రభుత్వ వైద్యశాలల్లో అత్యవసర సమయాల్లో మాత్రమే జనరేటర్లు వినియోగిస్తున్నారు. మిగిలిన సమయాల్లో అదనపు వ్యయం కారణంగా జనరేటర్లు నిలిపివేస్తున్నారు. దీంతో రోగులు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. గదుల్లో ఉండలేక చెట్ల కింద, వరండాల్లోకి చేరిపోతున్నారు. బయటకు రాలేని రోగులకు.. కుటుంబ సభ్యులే విసనకర్రలతో విసురుతున్న దృశ్యాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
"ఒక సమయం సందర్భం లేకుండా కరెంటు తీసేస్తే ఆస్పత్రుల్లో రోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆలోచించడంలేదు. ఇలా చేస్తే అత్యవసర పరిస్థితి ఏంటీ..? చిన్న పిల్లలు, ముసలివాళ్లు ఉన్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఒక టైంలో తీసేసి... ఒక టైంలో ఇచ్చినా బాగుండేది. కానీ ఒక టైమంటూ పాటించడం లేదు. చాలా దోమలు ఉన్నాయి. కరెంటు లేక నరకం చూస్తున్నాం." -ఆస్పత్రిలో రోగులు