రూ.10 లక్షల రివార్డు, ఆటోలు, రైళ్లు, బస్సులు, జన సమర్థ ప్రాంతాల్లో పోస్టర్లు. 24 గంటల పాటు గాలిస్తున్న మూడు కమిషనరేట్ల పరిధిలోని వేయి మందికి పైగా పోలీసులు. ఇదేదో గజ దొంగ లేకపోతే ఉగ్రవాదిని పట్టుకోవడానికి పోలీసులు పడుతున్న పాట్లు కాదు. సైదాబాద్ హత్యాచార నిందితుడు (Saidabad rape case) రాజు కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు పడుతున్న పాట్లు. ఈ నెల 9న చిన్నారిని పాశవికంగా హత్యాచారం చేసిన నిందితుడు రాజు కోసం ఆరు రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. అయినా అతని ఆచూకీ ఏమాత్రం లభించలేదు. దీంతో డీజీపీ మహేందర్ రెడ్డి రంగంలోకి నేరుగా దిగి గాలింపును పర్యవేక్షిస్తున్నారు.
సీసీ కెమెరాల పరిశీలన
నిందితుడు ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాల్లో సంచరిస్తుండొచ్చనే ఉద్దేశంతో రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్‌ను డీజీపీ మహేందర్ రెడ్డి అప్రమత్తం చేశారు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. మూడు కమిషనరేట్ల పరిధిలోని టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులు 24గంటల పాటు గాలింపు చర్యల్లోనే ఉన్నారు. ప్రధాన రహదారులు, వీధులతో పాటు కాలనీల్లో ఉండే సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఎస్సై ఆధ్వర్యంలో ఒక బృందం ఏర్పాటు చేసి స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కూడళ్ల వద్ద నిఘా
ట్రాఫిక్ పోలీసులు కూడా కూడళ్ల వద్ద నిఘా పెట్టారు. మూడు కమిషనరేట్లలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిల్లో గాలింపు కొనసాగుతోంది. రైళ్లు, బస్సులు, ఆటోలపై పోస్టర్లు అంటించారు. జనసమర్థ ప్రాంతాల్లో ప్రజలకు రాజు చేసిన నేరం గురించి వివరిస్తూ అతని ఆచూకీ చెప్పాలని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో సర్వత్రా విమర్శలు వస్తుండటంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. రాజకీయ, ప్రజా సంఘాలు బాధిత కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు.... ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. దీంతో నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది.
హోం మంత్రి సమీక్ష
ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన (Saidabad rape case) పట్ల సీఎం కేసీఆర్ విచారాన్ని వ్యక్తం చేసినట్లు హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి మహమూద్ అలీ హత్యాచార ఘటనపై సమీక్షించారు. నిందితుడిని గాలించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు హోంమంత్రికి డీజీపీ మహేందర్ రెడ్డి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేయాలని డీజీపీని మహమూద్ అలీ ఆదేశించారు. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని సూచించారు.