Police Behavior in Rape cases: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలోని కొన్ని పోలీస్‌స్టేషన్లలో ఇన్‌స్పెక్టర్లు, సెక్టార్ ఎస్సైలు లైంగికదాడి ఫిర్యాదులపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాధితుల బలహీనతను అవకాశం చేసుకొని నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇటీవల చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలి తరపు న్యాయవాది, తండ్రిని కొట్టిన ఎస్సైపై సీపీ స్టీఫెన్ రవీంద్ర శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. బాలానగర్ జోన్‌లోని మరో పోలీస్‌స్టేషన్‌లో మైనర్ అత్యాచార ఘటనలో నిందితులను చూసీచూడనట్లు వదిలేశారని బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
కేసులా.. కాసులా..:గ్రేటర్‌లోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో 2020లో 904 అత్యాచార కేసులు నమోదైతే 2021 నాటికి అది 1061కు చేరింది. ఈ ఏడాది 20-30 శాతం కేసులు పెరుగుతాయని పోలీసులే అంచనా వేస్తున్నారు. ఇవన్నీ బాధితులు ధైర్యంగా ముందుకు రావటం వల్ల నమోదైన కేసులు. పేద, మధ్యతరగతి కుటుంబాల నిస్సహాయతను ఆసరా చేసుకొని దర్జాగా రాజీ చేసుకొనే కేసులు రెట్టింపు ఉంటాయని అంచనా. కొన్ని ఠాణాల పోలీసులు అత్యాచార, పొక్సో కేసులను నమోదు చేసేందుకు వెనుకంజ వేస్తున్నాయి. లైంగిక దాడులను పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. మానవహక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు బాధితుల పక్షాన నిలుస్తున్నారు. నిందితుల్లో ప్రముఖుల కుటుంబాల ప్రమేయం ఉన్నట్లు తెలియగానే కొందరు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు బయటే తేల్చుకోమంటూ ఉచిత సలహాలిస్తున్నారు. సామాజిక, రాజకీయంగా అండదండల్లేని బాధితులతో ఠాణాల్లోనే పంచాయితీ చేస్తున్నారు. పెద్దమొత్తంలో కమీషన్లు పుచ్చుకుంటున్నారు.