Police Notices to MLA Raja Singh: తెలంగాణలో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41 ఏ సీఆర్‌పీసీ కింద షాహినాయత్‌గంజ్, మంగళ్‌హాట్ పోలీసులు రాజాసింగ్‌కు నోటీసులిచ్చారు. అయితే ఈ నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. కక్షపూరితంగా పాత కేసుల్లో నోటీసులు జారీ చేశారని రాజాసింగ్ ఆరోపించారు. నిన్న నోటీసులు సిద్ధం చేసి ఈరోజు తనకు అందించారని ఆక్షేపించారు. పాత కేసుల్లో అరెస్టు చేసేందుకు కుట్ర చేస్తున్నారన్న రాజాసింగ్.. కేసులు నమోదైన ఆర్నెళ్ల నుంచి పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు.
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసిన వీడియోతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. సదరు వీడియో వైరల్ కావటంతో.. రాజాసింగ్‌పై హైదరాబాద్‌లోని పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా రాజాసింగ్ వ్యాఖ్యానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ వర్గపు యువత.. ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం ఉదయం రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అటు రాజాసింగ్ ఇంటి పరిసరాలతో పాటు పాతబస్తీలో భారీగా బలగాలను మోహరించారు.