ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ పాపం మీదే.. ఏపీ జలవనరుల శాఖకు పోలవరం అథారిటీ ఘాటు లేఖ - పోలవరం ప్రాజెక్ట్ న్యూస్

Polavaram latest news: పోలవరం నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలు సానుకూలంగా లేవంటూ.. ఏపీ జలవనరులశాఖ కార్యదర్శికి పోలవరం అథారిటీ ఘాటు లేఖ రాసింది. సకాలంలో దిగువ కాఫర్‌ డ్యాం పూర్తి చేయలేదని.. ఫలితంగా వరద ముంచెత్తిందని పేర్కొంది. ఈ వైఫల్యానికి గుత్తేదారు సంస్థ, రాష్ట్ర జల వనరులశాఖే కారణమని తేల్చిచెప్పింది.

polavaram project
polavaram project

By

Published : Aug 10, 2022, 5:30 AM IST

Updated : Aug 10, 2022, 8:11 AM IST

Polavaram latest news: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యం కావడానికి ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖే కారణమని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఘంటాపథంగా తేల్చి చెప్పేసింది. గుత్తేదారు సంస్థ, రాష్ట్ర జలవనరులశాఖ సరైన ప్రణాళిక అమలు చేయకపోవడం వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని కుండ బద్దలుకొట్టింది. కేంద్ర జలవనరులశాఖ, జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ మార్గదర్శకాలనూ పాటించలేదని ఆక్షేపించింది. కేంద్ర సంస్థలు హెచ్చరిస్తున్నా రాష్ట్ర జలవనరులశాఖ అన్నింటినీ పెడచెవిన పెడుతోందని ఘాటుగా స్పందించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక యాజమాన్య విభాగం ఏర్పాటుచేయాలని మూడేళ్లుగా పోలవరం అథారిటీ చెబుతున్నా.. రాష్ట్ర జలవనరులశాఖ పట్టించుకోలేదని ఆక్షేపించింది. అనేక పరిశోధనలు, పరీక్షలు చేసి జులై 15 నాటికి కేంద్ర జలసంఘానికి నివేదికలు సమర్పించాలని చెప్పినా, ఇప్పటికే నెల ఆలస్యమైందని పేర్కొంది. జలవనరులశాఖ చేస్తున్న ఈ ఆలస్యాలు పోలవరం ప్రాజెక్టుకు నష్టం కలిగిస్తున్నాయని స్పష్టంచేసింది. తాజాగా గోదావరి వరదల్లో దిగువ కాఫర్‌ డ్యాం మీదుగా వరదనీరు పోటెత్తి ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని ముంచెత్తడానికి ప్రాజెక్టు నిర్మాణపనులు నెమ్మదిగా జరగడమే కారణమని తేల్చిచెప్పింది. పోలవరంలో తాజా పరిస్థితుల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యదర్శి ఎం.రఘురామ్‌ రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌కు జులై 22న లేఖ రాశారు. ఆ లేఖ మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. పోలవరం ప్రాజెక్టును 2024 జూన్‌ నాటికి పూర్తి చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూలు, వివిధ సమావేశాల్లో జరిగిన చర్చలు, కేంద్ర జల్‌శక్తి శాఖ, జలసంఘం, పోలవరం అథారిటీ చేసిన సూచనలు అమలుకాని వైనం తదితర అంశాలన్నింటినీ ఈ లేఖలో రఘురామ్‌ స్పష్టంగా పేర్కొంటూ ఏపీ ప్రభుత్వ వైఫల్యాన్ని వేలెత్తి చూపించారు.

2022 మే 22న కేంద్ర జల్‌శక్తి మంత్రి సలహాదారు నిర్వహించిన సమావేశంలో ఏం చెప్పారో గుర్తుచేసుకోండి. అనేక కారణాల వల్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసే గడువులను ఎప్పటికప్పుడు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. రాష్ట్ర జలవనరులశాఖ ఒక ఎగ్జిక్యూటివ్‌ ప్రాజెక్టు మేనేజిమెంట్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదే సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో కూడా ఒక విషయం వెల్లడించారు. ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ టూల్‌ను సేకరించి అన్నిచోట్లా ఏర్పాటుచేయాలని మూడేళ్లుగా పోలవరం అథారిటీ చెబుతూ ఉన్నా రాష్ట్ర జలవనరులశాఖ వినడం లేదని తెలియజేశారు. ఇలాంటి ప్రాజెక్టు నిర్వహణ టూల్‌తో పాటు సమర్థ మానవ వనరులను ఏర్పాటుచేయాలని కూడా పీపీఏ చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికైనా ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి.

లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి..

  • 2022 ఏప్రిల్‌లో ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూలు మారుస్తూ కమిటీ నివేదిక ఇచ్చింది. 2022 జులై 31 నాటికి దిగువ కాఫర్‌ డ్యాం పూర్తిచేస్తామని అందులో పేర్కొన్నారు. 2024 జూన్‌ నాటికి డిస్ట్రిబ్యూటరీలతో సహా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. 2022 ఫిబ్రవరి నుంచి జులై వరకు కేంద్ర జల్‌శక్తిశాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్వహించిన వివిధ సమావేశాల్లో దిగువ కాఫర్‌ డ్యాం జులై నెలాఖరుకు పూర్తిచేయాలని మేం చెబుతూనే ఉన్నాం.
  • దిగువ కాఫర్‌డ్యాంలో 25.46 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని చేయాల్సి ఉంది. 3.37 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని జరిగింది. మిగిలిన పనిని మేఘా ఇంజినీరింగుకు అప్పచెప్పారు. వారు 2020 నవంబరు నుంచి పనిచేసేలా షెడ్యూలు రూపొందించారు. 2021 జులైకే పని పూర్తిచేయాలి. 2020 వరదల్లో భారీ గుంతలు ఏర్పడటంతో 2022 జులై 31 నాటికి ఈ నిర్మాణం పూర్తిచేసేలా షెడ్యూలు సవరించారు.
  • దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణ పనులు 2022 జులై 31 నాటికి పూర్తిచేస్తామని పోలవరం ప్రాజెక్టు సీఈ 2022 మే 9న ప్రాజెక్టు అథారిటీ సీఈవో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కూడా చెప్పారు.
  • 2022 మే 21, 22, 24 తేదీల్లో కేంద్ర జల్‌శక్తి మంత్రి ప్రధాన సలహాదారు పోలవరం ప్రాజెక్టును సందర్శించి, సమీక్షించారు. దిగువ కాఫర్‌ డ్యాం పనులను 2022 జులై 31కి పూర్తిచేస్తామని ఈఎన్‌సీ తెలియజేశారు. దిగువ కాఫర్‌ డ్యాం డిజైన్లు కూడా ఏప్రిల్‌ మధ్యనాటికే ఖరారయ్యాయి.
  • కేంద్ర జలసంఘం డైరెక్టర్‌ అదే సమావేశంలో మాట్లాడుతూ 2022 జులై నెలాఖరుకు దిగువ కాఫర్‌ డ్యాంను రక్షితస్థాయికి తీసుకువెళ్లాలని కూడా చెప్పారు. కాఫర్‌ డ్యాంలో క్లే కోర్‌ పని కూడా పొడి వాతావరణంలోనే పూర్తి చేయాలని, వర్షాకాలంలో చేయడం శ్రేయస్కరం కాదని వెల్లడించారు. దిగువ కాఫర్‌ డ్యాంను 2022 జులై 31 నాటికి పూర్తిచేయాలని కేంద్రజల్‌శక్తి మంత్రికి తెలియజేసినట్లు ఆయన సలహాదారు ఈ సమావేశంలో వెల్లడించారు. దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తి చేయాలంటే నిర్మాణ పనులు చేస్తున్న మేఘా సంస్థ అదనపు వనరులు, మానవవనరులు సమకూర్చుకోవాలనీ ఆయన సలహా ఇచ్చారు. ఈ సమస్యలను రాష్ట్ర జలవనరులశాఖ, గుత్తేదారు పరిష్కరించుకోవాలని సూచించారు.
  • 2022 జూన్‌ 19న నిపుణుల కమిటీ ఛైర్మన్‌, కేంద్ర జలసంఘం సభ్యుడు ఇదే విషయంపై అనేక సూచనలు చేశారు. మునుపటి వరదల రికార్డును పరిశీలించి దిగువ కాఫర్‌ డ్యాంను తక్షణమే రక్షిత స్థాయికి తీసుకువెళ్లాలని తెలిపారు. నిర్మాణపరంగా ఉన్న సమస్యలను అధిగమించేందుకు ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలనీ తెలియజేశారు.
  • 2022 జులై 9న ప్రాజెక్టు అథారిటీ సీఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ఏపీ జలవనరులశాఖ ఒక ప్రజంటేషన్‌ ఇచ్చింది. దిగువ కాఫర్‌ డ్యాం సున్నా మీటర్ల నుంచి 680 మీటర్ల వరకు కోత పడినచోట పనుల పురోగతి లేదని, లక్ష్యానికి తగ్గట్టుగా పని జరగడం లేదని అథారిటీ గుర్తించింది. 157 ప్యానెళ్లకు 104 మాత్రమే పూర్తయ్యాయి. రాక్‌ఫిల్‌ డ్యాం 18 మీటర్ల ఎత్తు, 19 మీటర్ల ఎత్తు స్థాయిలోనే ఉన్నాయి. ఇవి సురక్షిత స్థాయిల కన్నా తక్కువ ఎత్తులో ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం సకాలంలో పూర్తిచేయాలంటే దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కేంద్ర జలసంఘం డైరెక్టర్‌ తెలియజేశారు. దిగువ కాఫర్‌ డ్యాం వద్ద నీటిమట్టాలు కోర్‌ స్థాయికి చాలా దగ్గరగా ఉన్నాయనీ పేర్కొన్నారు. దిగువ కాఫర్‌ డ్యాంలో డయాఫ్రం వాల్‌ను ఎందుకు సకాలంలో పూర్తి చేయలేకపోయారని పోలవరం అథారిటీ సీఈవో ప్రశ్నించారు. డి.వాల్‌ కోసం కందకాన్ని తవ్వేక్రమంలో ఎదురైన సమస్యల వల్ల ఆల్యమైందని ఈఎన్‌సీ తెలియజేశారు. అందువల్లే దిగువ కాఫర్‌ డ్యాం సురక్షిత స్థాయికి తీసుకువెళ్లలేకపోయామని పేర్కొన్నారు.

ఈ కారణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణాన్ని సకాలంలో పూర్తిచేయడంలో ఏపీ జలవనరులశాఖ వెనకబడిన విషయం స్పష్టమవుతోంది. దీనివల్ల దిగువ కాఫర్‌ డ్యాం మీదుగా వరద నీరు వెనక్కి ఎగదన్నింది. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రాంతం అంతా నీటితో నిండిపోయింది. 2022 జులై 15లోగా అన్ని పరిశోధనలు పూర్తిచేసి నివేదికలు సమర్పించాలన్నా ఇప్పటికే నెల రోజులు ఆలస్యంతో ఉన్నారు. ఇలాంటి ఆలస్యాలు ప్రాజెక్టు పురోగతికి తోడ్పడవు. ప్రస్తుత పరిణామాల వల్ల తలెత్తే అన్ని ఇతర పరిణామాలూ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేస్తాయి. ఇదంతా రాష్ట్ర జలవనరులశాఖ, ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన గుత్తేదారు సంస్థల నిర్వహణ వైఫల్యమే.

ఇవీ చదవండి:కోరికలు తీర్చే రొట్టెల పండుగ.. మతసామరస్యానికి ప్రతీక

భార్య బుగ్గ కొరికిన భర్త.. కేసు నమోదు చేసిన పోలీసులు

Last Updated : Aug 10, 2022, 8:11 AM IST

ABOUT THE AUTHOR

...view details