Modi BJP corporators Meeting: తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన భాజపా జాతీయ నాయకత్వం పార్టీని బలోపేతం చేసే కార్యాచరణను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భాజపా కార్పొరేటర్లు దిల్లీకి రావాలని ఆహ్వానం అందింది. వీరు ప్రధానిమోదీతో భేటీకి సంబంధించి మంగళవారం సాయంత్రం 4 గంటలకు అపాయింట్‌మెంట్ ఖరారైనట్లు తెలుస్తోంది. భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, పార్టీ మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జ్ మురళీధర్‌రావు సైతం ప్రధానిని కలవనున్నట్లు సమాచారం.
వీరితోపాటు రంగారెడ్డి అర్బన్, మేడ్చల్ అర్బన్, భాగ్యనగర్, మహంకాళి, గోల్కొండ, హైదరాబాద్ సెంట్రల్ జిల్లాల అధ్యక్షులు సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లోని ఐఎస్బీ వార్షికోత్సవానికి వచ్చిన మోదీ... కార్పొరేటర్లతో సమావేశం కావాలని నిర్ణయించినా వర్షం కారణంగా రద్దయింది. దీంతో కార్పొరేటర్లకు దిల్లీ నుంచి పిలుపువచ్చింది. గతంలో జీహెచ్ఎంసీలో భాజపా కార్పొరేటర్ల బలం 3 స్థానాలే కాగా... ఈసారి ఆ సంఖ్య 47కి చేరింది. వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని పట్టుసాధించాలంటే కార్యకర్తల కృషి ఎంతో అవసరమని... ఒకసారి సమావేశం నిర్వహిస్తే వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని పార్టీ భావిస్తోంది.
ఇదీ చదవండి: