ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SCHEME FOR DISPUTE RESOLUTION: భూవివాద పరిష్కారానికి కొత్త విధానం - ap 2021 news

రాష్ట్రంలో ఈనాం భూములు, ఇతర భూ వివాదాల పరిష్కారానికి ఓ కొత్త పథకం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం-ప్రైవేట్ మధ్య వివాదంలో ఉన్న భూముల విలువ 1500 కోట్లకుపైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి పరిష్కారానికి రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలను వేయాలని సర్కారు యోచిస్తోంది. ఈనాం చట్టంలోనూ సవరణకు చర్యలు తీసుకుంటుంది.

planning-for-special-committees-in-the-name-of-land-dispute-resolution-scheme-at-ap
భూవివాద పరిష్కారానికి కొత్త విధానం

By

Published : Sep 7, 2021, 12:45 PM IST

భూవివాద పరిష్కారానికి కొత్త విధానం

స్కీమ్ ఫర్ డిస్‌ప్యూట్‌ రిజల్యూషన్‌ పేరిట... రాష్ట్రంలో భూ వివాదాల పరిష్కారానికి కొత్తగా కమిటీలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం - ప్రైవేట్‌ మధ్య పరస్పరం వందలాది కేసులు కోర్టులు, ట్రైబ్యునళ్లలో ఉన్నాయి. దీర్ఘకాలంగా వీటికి పరిష్కారం లభించకపోతుండటంతో... విలువైన ఆదాయం కోల్పోతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వానికి చెందిన 908 ఎకరాలకు సంబంధించి ప్రైవేట్‌వారిపై 32కిపైగా కేసులున్నాయి. ఆయా భూముల విలువ 436 కోట్లు ఉంటుందని అంచనా. 6 వేల 492 ఎకరాలకు సంబంధించి ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వంపై దాఖలు చేసిన కేసులు 76 కాగా... దీని విలువ 1054 కోట్లుగా నిర్ధరించారు. ప్రైవేట్ వ్యక్తుల మధ్య 275కిపైగా కేసుల్లో... వివాదాల్లో ఉన్న 5 వేల 231 ఎకరాల విలువ 3వేల 300 కోట్లుగా గుర్తించారు. మొత్తం మీద వివిధ కేసుల కారణంగా 12వేల 632 ఎకరాలు వివాదంలో ఉన్నాయి.

భూ వివాద కేసులన్నీ ప్రస్తుతం అప్పిలేట్ అథారిటీల వద్ద అపరిష్కృతంగా ఉన్నాయి. దీనిపై ట్రైబ్యునల్ ఏర్పాటుకు ప్రభుత్వం యత్నించినా... వర్కింగ్ కమిటీ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. జిల్లా, రాష్ట్రస్థాయిల్లో కమిటీల ఏర్పాటు ద్వారా వివాద పరిష్కారానికి ప్రభుత్వం యోచిస్తోంది. 2019 మే 30 కన్నా ముందున్న కేసులకు కటాఫ్ డేట్ నిర్దేశించి... వీటిని పరిష్కరించాలని నిర్ణయించింది. ప్రభుత్వ భూములు, ల్యాండ్ సీలింగ్, గుడి పోరంబోకు, ప్రజల కోసం ఉద్దేశించిన బహిరంగ ప్రదేశాలకు చెందిన భూములను క్రమబద్ధీకరించకూడదని నిర్ణయించారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములనూ క్రమబద్ధీకరించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. విశాఖ, విజయవాడ నగరాల్లో 4500 చదరపు మీటర్ల మేర, గుంటూరులో 6 వేల చదరపు మీటర్ల మేర క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో భూసంస్కరణల చట్టానికి అనుగుణంగానే క్రమబద్ధీకరణ చేపట్టనున్నారు.

క్రమబద్ధీకరణతో పాటు వివాదాల పరిష్కారంతో రెవెన్యూ గణనీయంగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ , రాష్ట్రస్థాయిలో భూపరిపాలన శాఖ చీఫ్ కమిషనర్‌... ఈ వివాద పరిష్కార పథకం కమిటీల ఛైర్మన్లుగా వ్యవహరించనున్నారు. ఈనాం చట్టంలోని సెక్షన్-7ను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ భూముల వివాదాలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన పథకం ఏర్పాటుపై ముందుగా అడ్వకేట్ జనరల్ అనుమతి తీసుకున్న అనంతరం ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదీ చూడండి:పొంగి పొర్లుతున్న జలాశయాలు.. ఉద్ధృతి తట్టుకోలేక కాలువకు గండ్లు..!

ABOUT THE AUTHOR

...view details