పెట్రో ధరల పెరుగుదలకు ఇప్పట్లో అవకాశాలున్నట్లు కనిపించట్లేదు. రోజురోజుకు పైపైకి పోతున్నాయే తప్ప.. తగ్గే పరిస్థితి కనూచూపుమేరలో ఉన్నట్లు లేదు. పెట్రోల్, డీజల్ ధరల మోతతో ఇప్పటికే సామాన్యుల నడ్డి విరుగుతుంటే.. ఏకంగా గ్యాస్ బండతో మోదుతున్నాయి ఆయిల్ కంపెనీలు. దసరా పండుగ ముందు వంట గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెంచేశారు.
14.2 కేజీల సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.15 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు అమల్లోకి వచ్చేశాయి. గ్యాస్ సిలిండర్ వాడే వారిపై తీవ్ర ప్రభావం పడింది. హైదరాబాద్లో 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.937కు చేరింది. దిల్లీలో సబ్సిడీ లేకుండా 14.2 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు రూ.899.50కి పెరిగింది. కోల్‌కతాలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.911 నుంచి రూ.926కి, ముంబైలో రూ.844.50 నుండి రూ.899.50కి పెరిగింది. చెన్నైలో సబ్సిడీయేతర సిలిండర్ ధర ఇప్పుడు రూ.915.50.