ఉల్లి ధరలు పైపైకి ఎగబాకుతున్న కొద్దీ... ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఉల్లి కోసం ప్రజల పాట్లూ రెట్టింపుతున్నాయి. కిలో ఉల్లి అయినా సంపాదించుకొనేందుకు గుంటూరు జిల్లాలో ఉదయం, సాయంత్రం రైతు బజార్ల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. గంటల తరబడి పడిగాపులు కాసినా.. కొన్నిసార్లు ఉల్లి దొరక్క అసహనానికి గురవుతున్నారు. గుంటూరు నగర ప్రజలకు రోజుకు 20 టన్నుల వరకు ఉల్లిపాయలు అవసరం కాగా.... ప్రస్తుతం 10 టన్నుల ఉల్లిపాయలను మాత్రమే ప్రభుత్వం సమకూరుస్తోంది. 2 పూటలా 2 గంటల చొప్పున ఉల్లి పంపిణీ చేస్తున్నప్పటికీ డిమాండ్‌కు తగిన స్థాయిలో అందడం లేదు. చుట్టుగుంట, పట్టాభిపురం రైతుబజార్లు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తే ఇబ్బందులు తగ్గుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలోనూ ప్రజలు ఎక్కడికక్కడ ఉల్లిపాయల కోసం బారులు తీరారు. నిద్ర లేచీ లేవగానే రైతు బజార్ల బాట పడుతున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ ప్రాంతాల్లోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి.
దేశంలో మరెక్కడా లేని విధంగా, ఏపీలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం 25 రూపాయలకే కిలో ఉల్లి అందిస్తోందని మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. ప్రజల భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే... రాష్ట్ర ప్రభుత్వం కిలో ఉల్లికి వంద రూపాయల వరకూ రాయితీ రూపంలో భరిస్తోందని తెలిపారు. పొరుగున ఉన్న తెలంగాణలో అక్కడి ప్రభుత్వం కిలో ఉల్లి 45 రూపాయలకు అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ఉల్లిపాయలను అందుబాటులో ఉంచామన్నారు. వ్యవసాయ, పౌరసరఫరాల, మార్కెటింగ్ శాఖ, రైతుబజార్ల ఎస్టేట్ అధికారులతో నిత్యం సీఎం కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తోందన్నారు.