ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Irrigation Projects: సాగునీటి ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పెండింగ్‌ బిల్లులు

సాగునీటి ప్రాజెక్టుల్లో పెండింగ్ బిల్లులు పేరుకుపోయాయి. రూ.వెయ్యి కోట్లు వెచ్చిస్తే అందుబాటులోకి వచ్చేవాటిపైనా నిర్లక్ష్యం వహిస్తున్నారు. పాలనామోదం పొందిన పథకాల వ్యయ అంచనా.. రూ.లక్ష కోట్లుగా జల వనరులశాఖ తాజాగా అంచనా వేసింది.

projects
projects

By

Published : Sep 21, 2021, 7:26 AM IST

రాష్ట్రంలో కీలక సాగునీటి పథకాలకు నిధుల గ్రహణం పట్టింది. చిన్నమొత్తంలో ఖర్చుచేస్తే అందుబాటులోకి వచ్చే ప్రాజెక్టుల్లోనూ పనులు జరగక ప్రయోజనం నెరవేరడం లేదు. అరకొర నిధుల కేటాయింపుతో పాటు చేసిన పనులకూ బిల్లులు రాకపోవడం సమస్యగా పరిణమించింది. రాష్ట్ర ప్రభుత్వ పాలనామోదం పొందిన ప్రాజెక్టులు పాతవి, కొత్తవి కలిపి 91 వరకు ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేయాలంటే రూ.1.05 లక్షల కోట్లు అవసరమని జలవనరుల శాఖ తాజాగా అంచనా వేసింది. ఇందులో పోలవరం వంటి భారీ ప్రాజెక్టులూ ఉన్నాయి. ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదిస్తున్నవి కూడా కలిపితే ఈ అంచనా మరో రూ.30 వేల కోట్లకు పైగా పెరుగుతుంది.అవసరాలు ఇంత భారీగా ఉంటే.. గత రెండున్నర ఏళ్లలో వీటిపై చేసిన ఖర్చు రూ.10 వేల కోట్లు కూడా లేదు. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో వెచ్చించిన వ్యయం రూ.7,612 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,400 కోట్ల వరకు బడ్జెట్‌ విడుదలకు ఉత్తర్వులు ఇచ్చినా.. ఇంకా బిల్లులు చెల్లించలేదు. వివిధ ప్రాజెక్టుల కింద నిర్వాసితులకు పునరావాస చర్యలకు వెచ్చిస్తున్న మొత్తమే ఎక్కువగా ఉంటోంది. ఈ తరుణంలో తక్కువ వ్యయంతో అందుబాటులోకి వచ్చే ప్రాజెక్టులపై దృష్టి పెడితే.. తక్షణ ప్రయోజనం పొందవచ్చని ఆ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నారు.

ఎప్పటికప్పుడు కొత్త గడువులు

సాగునీటి రంగంపై 2020 సంవత్సరంలో సమీక్షించిన ప్రభుత్వం మరుసటి ఏడాది (2021) మార్చి నాటికి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను ఎంచుకొంది. రూ.1,078 కోట్లు ఖర్చుచేస్తే ఇవి సాకారమవుతాయని పేర్కొంది. అయితే, ఏడాది గడిచింది. పురోగతి లోపించింది. 2021 ఏప్రిల్‌ 7న ముఖ్యమంత్రి జగన్‌ మరోసారి ఈ ప్రాజెక్టుల స్థితిపై సమీక్షించారు. అధికారులు యథాప్రకారం కొత్త గడువులు, కొత్త లక్ష్యాలు ప్రకటించారు. ఆ గడువులు కూడా మీరిపోయాయి. ఇంకా పనులు మందకొడిగా సాగుతూనే ఉన్నాయి.

లక్ష్యం.. వాస్తవం

ఏప్రిల్‌ 7న ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా నిర్దేశించుకున్న లక్ష్యాలు.. వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే..
* వెలిగొండ ప్రాజెక్టు నుంచి సెప్టెంబర్‌లో నీళ్లు విడుదల చేస్తాం. డిసెంబర్‌ నాటికి రెండో టన్నెల్‌ పూర్తి చేస్తాం.
* ఈ నెలలో నీళ్లు విడుదలయ్యే అవకాశాలు లేవు. రెండో సొరంగం పనులు ఆలస్యమవుతున్నాయి.
* మే నెలాఖరుకు సంగం, నెల్లూరు బ్యారేజీలు పూర్తి చేస్తాం.
* సెప్టెంబర్‌ రెండోవారంలోనూ పనులు జరుగుతున్నాయి.
* జులై నాటికి వంశధార రెండో దశ, వంశధార-నాగావళి అనుసంధానం పూర్తి చేస్తాం.
* ఇంకా పనులు సాగుతూనే ఉన్నాయి.
*అవుకు సొరంగం నుంచి ఆగస్టు నాటికి 20 వేల క్యూసెక్కులు నీటిని మళ్లిస్తాం.
* సెప్టెంబర్‌లోనూ పనులు చేస్తున్నారు.

నిధిలేక.. నిర్మాణమెలా?

రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 91 ప్రాజెక్టులకు పాలనామోదం ఇచ్చారు. ఏళ్ల కిందట పాలనామోదం పొందిన 42 పాత ప్రాజెక్టులు కూడా పూర్తి కావాలంటే దాదాపు రూ.25 వేల కోట్లు కావాలి. పోలవరం ప్రాజెక్టుకు ఇంకా రూ.30 వేల కోట్లకు పైగా అవసరం. ఈ దశలో సాగునీటి రంగంపై చేస్తున్న ఖర్చు తగ్గడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో సాగునీటి రంగంలో మూలధన వ్యయం, జీతాలు, నిర్వహణ తదితరాలన్నింటికి కలిపి రూ.13,200 కోట్లు ప్రతిపాదించారు. ఈ ఏడాది తొలి అర్ధభాగం ముగుస్తున్నప్పటికీ.. పెద్దఎత్తున బిల్లులు పెండింగులో ఉన్నాయి. ‘బకాయిలు చెల్లిస్తేనే పనులు చేస్తాం. లేకుంటే.. లేదు’ అన్నట్లుగా గుత్తేదారులు వ్యవహరిస్తున్నారు. ఇంజినీర్లు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రోడ్ల నిర్మాణాలకు ముందుకురాని గుత్తేదారులు.. సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ విముఖత చూపుతున్నారు. వెరసి చాలా ప్రాజెక్టుల్లో అరకొర పనులే సాగుతున్నాయి.

వంశధార రెండో దశ బకాయిలు దాదాపు రూ.100 కోట్లు

వంశధార రెండో దశ ఇప్పటికే పూర్తికావాల్సి ఉంది. అక్కడ ప్రధాన కాలువ నిర్మాణం దాదాపు పూర్తి చేసి హిరమండలం జలాశయంలోకి నీళ్లు నింపుతున్నారు. డిస్ట్రిబ్యూటరీ కాల్వలు తవ్వలేదు. దాదాపు 90శాతం పనులు పూర్తికాగా, 10 శాతం చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. భూసేకరణ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధాన కాలువ లైనింగ్‌ ఇంకొంత మిగిలి ఉంది.

అనుసంధాన ప్రాజెక్టు బకాయిలు

దాదాపు రూ.19 కోట్లు

వంశధార-నాగావళి అనుసంధానం ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. కొన్ని ఆకృతులను ఆమోదించాల్సి ఉంది. కట్టడాల నిర్మాణం పూర్తి కావాలి.

నెల్లూరు బ్యారేజీ బకాయిలు

రూ.10 కోట్లు

నెల్లూరు బ్యారేజీ పనులు దాదాపు కొలిక్కి వచ్చాయి. చిన్నమొత్తం నిధుల్లేని కారణంగా ఎలక్ట్రికల్‌, రివిట్‌మెంట్‌, అప్రోచ్‌ రోడ్డు పనులు మిగిలాయి.

సంగం బ్యారేజీ బకాయిలు

సుమారు రూ.40 కోట్లు

సంగం బ్యారేజీ పైభాగంలో ఐదు శ్లాబులు నిర్మాణంలో ఉన్నాయి. ఎడమ వైపు రక్షణ పనులు చేయాల్సి ఉంది. బెజవాడ పాపిరెడ్డికాలువ, కనిగిరి జలాశయం ప్రధాన కాలువకు జలాలు తరలించే రెగ్యులేటర్‌ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. ఈ బ్యారేజీలో గేట్ల అమరిక పూర్తికాలేదు.

ఇదీ చదవండి: CBN : 'ధైర్యముంటే అసెంబ్లీని రద్దు చేయండి'

ABOUT THE AUTHOR

...view details