కృష్ణా నది ఉప్పొంగినట్లు కాంగ్రెస్ సభకు ప్రజలు వచ్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమకారులు ఆవేశంతో ఉన్నారని.. మరో 18 నెలల్లో కేసీఆర్‌ను గద్దె దించాలని ఆవేశంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ కోసం చనిపోయిందెవరో ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఇవాళ తెలంగాణ సంపదను దోచుకుంటున్నదెవరో చెప్పాలన్నారు. కాంగ్రెస్ సభలు చూసి కేసీఆర్ గుండెల్లో గునపం దిగినట్లు ఉందన్నారు. దళితబంధు కింద ఇచ్చే రూ.10 లక్షలు ఎవరి భిక్షం కాదని.. ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చిన సొమ్మునే మళ్లీ వాళ్లకు ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ 4 కోట్ల ప్రజల భవిష్యత్ హుజూరాబాద్ బిడ్డల చేతిలో ఉందని చెప్పారు.
ప్రణబ్ ముఖర్జి వచ్చినప్పుడు, మాజీ గవర్నర్ నరసింహన్ కనిపించినప్పుడు కేసీఆర్ వాళ్ల కాళ్లు మొక్కుతాడు. దళిత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వచ్చినప్పుడు కనీసం నమస్కారం కూడా చేయలేదు. మొదటి సీఎస్ రాజీవ్ శర్మ, తర్వాత సీఎస్ ఎస్కే జోషి, మొదటి డీజీపీ అనురాగ్ శర్మ ఈ ముగ్గురి పదవులను మూడుసార్లు పొడిగించారు. ఇప్పుడు వారిని ప్రభుత్వ సలహాదార్లుగా నియమించుకున్నారు. కాని ఒక దళిత బిడ్డ ప్రదీప్ చంద్ర సీఎస్ అయితే ఒకటే నెలకు రిటైర్మెంట్ ఇచ్చారు. ఇదే కేసీఆర్ దళితుల పట్ల ఉన్న గౌరవం. భూపాలపల్లి కలెక్టర్గా ఉన్న మురళి పేదళ్ల గురించి మాట్లాడితే.. అతన్ని అవమానించారు. ఆయన రాజీనామా చేసి బయటకు వెళ్లారు. పాలమూరు బిడ్డ ప్రవీణ్ కుమార్ 6 ఏళ్ల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేశారు.