తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Pcc Chief Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. తనకున్న రాజకీయ అవగాహన ప్రకారంగా కాంగ్రెస్ కచ్చితంగా 72 సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఇందిరాభవన్‌లో నియోజవర్గ పార్టీ సమన్వయ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నాయన్నారు. కార్యకర్తలు కూడా గట్టిగా పనిచేస్తున్నారని కితాబుచ్చారు. అలాగే నాయకులు కూడా గట్టిగా కొట్లాడాలన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఆపేసి... కేసీఆర్ ఇప్పుడు దళితబంధు పేరుతో పథకాన్ని ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని అమలు చేస్తున్నారని... వీటన్నింటిపై ప్రధాన ప్రతిపక్షంగా మనమంతా నిలదీయాలని సూచించారు.
రూ. 10 లక్షలు ఇస్తాడా..?
ఎన్నికల ముందు అనేక హామీలు ఇస్తారని తర్వాత ఎగ్గొడతారని తెలిపారు. హైదరాబాద్‌లో రూ. 10వేలు ఇవ్వలేని కేసీఆర్... రాష్ట్రంలో ఉన్న 30 లక్షల దళిత గిరిజన కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎలా ఇస్తారని ప్రశ్నించాలన్నారు. అందుకోసమే ఆగస్టు 9న క్విట్ ఇండియా దినం నుంచి తెలంగాణ విలీన దినం సెప్టెంబర్ 17వరకు 40 రోజులపాటు ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.
వారిని గుర్తిస్తాం...
బాగా పనిచేసిన కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందని రేవంత్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసిన వారి పనితీరుతోనే పార్టీ బాగుపడుతుందన్నారు. ఏ స్థాయిలో పనిచేస్తున్న నాయకులు అయినా నియోజకవర్గంలో వారి పనితీరుపైన నివేదిక ఇవ్వాలని సూచించారు. పార్టీ నిర్మాణం ప్రజాసమస్యలపై పోరాటం విషయంలో నాయకులు చురుగ్గా ఉండాలన్నారు. నియోజకవర్గంలో ఉన్న నాయకులకు సమన్వయకర్తలు కచ్చితంగా సమాచారం ఇవ్వాలని తెలిపారు.