జనసేన పార్టీ క్రియాశీలక సమావేశాలు రెండు రోజులపాటు గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనున్నాయి. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ సమావేశాలలో పాల్గొంటారు. ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాలలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రం విజయవంతంగా పూర్తయింది. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు ఆ నియోజకవర్గాల నేతలతో పవన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ క్రియాశీల సభ్యులకు పవన్ బీమాపత్రాలు ప్రదానం చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం జరుగుతుంది.
18వ తేదీ ఉదయం పది గంటలకు అమరావతి పోరాట సమితి నేతలు, మహిళా రైతులతో జనసేనాని భేటీ అవుతారు. క్రియాశీలక సభ్యత్వంపై 32 నియోజకవర్గాల ఇంఛార్జిలతో 11 గంటలకు సమావేశం కానున్నారు. సభ్యత్వ నమోదు కోసం పార్టీ ఐటీ విభాగం రూపొందించిన యాప్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ను పరిశీలిస్తారని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.