లాక్డౌన్ వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న మధ్యతరగతి, వేతన జీవుల కోసం కేంద్రం ఆర్థిక ఉపశమన చర్యలు చేపట్టడం మంచి నిర్ణయమని జనసేన అధినేత పవన్ అన్నారు. ఈ చర్యలు మధ్యతరగతికి భరోసా కల్పించేలా ఉన్నాయన్నారు. మోదీ ప్రభుత్వం మధ్య తరగతికి ఆర్థిక ఊతం ఇచ్చే దిశగానే నిర్ణయాలు తీసుకుంటుందన్న పవన్.... ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలోనూ ఆ విషయం స్పష్టమైందన్నారు.
మధ్య తరగతికి మేలు చేసేలా ఆర్థిక ప్యాకేజీ: పవన్ - మధ్యతరగతి ఆర్థిక ప్యాకేజీపై పవన్
కేంద్రం తెచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ఆర్థిక ప్యాకేజీ మధ్యతరగతి వారికి మేలు చేస్తుందని జనసేనాని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇంటి రుణాలపై రాయితీ పెంపు, పన్ను రిఫండ్ చర్యలు మధ్యతరగతికి ఉపయోగపడతాయన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి మధ్యతరగతి అభ్యున్నతికి కృషి చేస్తోందని పవన్ పేర్కొన్నారు.
ఇంటి రుణాలపై వడ్డీ రాయితీని రూ.1.5 లక్షల మేర పెంచడం ఉద్యోగులు, చిరు వ్యాపారాలకు ఉపశమనం కలిగిస్తుందని పవన్ అన్నారు. ఆదాయపన్ను కట్టేవారికి రిఫండ్ చెల్లించడంలో జాప్యాన్ని నివారించే చర్యలు తీసుకోవడంతో 14 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట కలుగుతుందన్నారు. కరోనా వల్ల కుటుంబ బడ్జెట్ తలకిందులవుతున్న తరుణంలో... మధ్యతరగతి వారికి ఆసరాగా బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు ఉద్దీపన చర్యలు చేపట్టడం మంచి నిర్ణయమన్నారు. జనసేన శ్రేణులు కేంద్రం తెచ్చిన ఆర్థిక ఉపశమన చర్యలు గురించి ప్రజలకు తెలియజేయాలని పవన్ పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి :'బతుకు'లేక బడి పంతులు.. అరటి పండ్లు అమ్ముతున్నాడు!