తుపాను కారణంగా నష్టపోయిన రైతుల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బాధిత రైతులకు అండగా ఈనెల 28న కలెక్టర్లకు వినతిపత్రాలు అందిస్తామన్నారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్ ... కౌలురైతు, భూమిని దున్నే రైతు కోసమే జనసేన ఆధ్వర్యంలో 'జై కిసాన్ కార్యక్రమం' చేపట్టినట్లు తెలిపారు.
తుపాను కారణంగా 19 లక్షల ఎకరాలలో పంట దెబ్బ తిని దాదాపు 9 లక్షల మంది రైతులు నష్టపోయినా... ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదని పవన్ విమర్శించారు. కౌలు రైతు కోసం ప్రత్యేక నినాదంతో ముందుకెళ్తామన్నారు. రాష్ట్రంలో రహదారులు దారుణంగా ఉన్నాయని.. నాలుగు జిల్లాల పర్యటనలో భాగంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ప్రత్యక్షంగా చూశానని పవన్ అన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన రైతు బీమా పథకం అంకెల గారడీగా కనబడుతోందని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఈ పథకం రైతులకు ధైర్యం నింపేలా లేదన్నారు.