ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Tv Lessons: టీవీ పాఠాలు లేవా... ఈ ఏడాదీ సెలవేనా? - School online news

కరోనా వేళ ఒకటి, రెండో తరగతి చిన్నారుల చదువుపైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. టీవీ (Tv Lessons)ల ద్వారా తరగతులు ప్రసారం చేస్తే పిల్లలకు ప్రయోజనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీవీలో చూడడం, వినడం ద్వారా కొత్త కొత్త పదాలు నేర్చుకుంటారని భావిస్తున్నారు. ప్రభుత్వం వీరి చదువులను విస్మరించకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Tv Lessons
Tv Lessons

By

Published : Jun 6, 2021, 9:14 AM IST

కరోనా (Corona) నేపథ్యంలో చిన్నారుల చదువుల గురించి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాదీ వారి ఆశలు అడియాశలయ్యేటట్లున్నాయి. గత ఏడాది ప్రైవేటు పాఠశాలలు ఎల్‌కేజీ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించాయి. ప్రభుత్వ బడుల్లో మాత్రం 1, 2 తరగతులకు కనీసం టీవీల ద్వారానూ పాఠాలు చెప్పలేదు. ఈ ఏడాది (2021-22) కూడా పాఠశాల విద్యాశాఖ వీరిని విస్మరిస్తోంది. 3 నుంచి 10 తరగతుల విద్యార్థులకు డీడీ యాదగిరి, టీశాట్‌ ద్వారా రికార్డు చేసిన వీడియో పాఠాల ప్రసారానికి సిద్ధమవుతున్న విద్యాశాఖ 1, 2 తరగతుల విద్యార్థులను మాత్రం పట్టించుకోవడంలేదు. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఈ తరగతుల్లోని దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు నష్టపోనున్నారు.

కేంద్రం ఏం చెప్పింది..

కరోనా పరిస్థితుల్లో పూర్వ ప్రాథమిక తరగతుల నుంచి ఆన్‌లైన్‌ పాఠాలు బోధించవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఆన్‌లైన్‌ పాఠాలు వినాలంటే స్మార్ట్‌ఫోన్‌ లేక కంప్యూటర్‌ ఉపయోగించాలి. వాటిని ఎక్కువ సమయం వినియోగిస్తే చిన్నారుల కళ్లకు ఇబ్బంది అవుతుందని భావించిన జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) నిపుణులు ఒకరోజులో ఎంత సమయం ఆన్‌లైన్‌ పాఠాలకు కేటాయించవచ్చో పక్కాగా నిర్దేశించారు. ఆ మేరకు గత ఏడాది జులైలో ‘ప్రజ్ఞాత’ పేరిట కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది.

టీవీలో పాఠాలు...

పూర్వ ప్రాథమిక విద్యార్థులకు (ఎల్‌కేజీ, యూకేజీ) 30 నిమిషాలకు మించకుండా, 1-8 తరగతుల విద్యార్థులకు ఒక్కో పాఠం 30-45 నిమిషాలకు మించకుండా రోజుకు రెండు పీరియడ్లు (గంట నుంచి గంటన్నర), 9-12 తరగతులకు నాలుగు పీరియడ్లు (2-3 గంటలు) బోధించాలని పేర్కొంది. దీని ప్రకారం పలు రాష్ట్రాలు గత ఏడాది కూడా ఒకటో తరగతి నుంచే ఆన్‌లైన్‌ విద్యను అందించాయి. కేరళ ప్రభుత్వం ఈసారి కూడా జూన్‌ 1న 1 నుంచి 8 తరగతులకు టీవీలో పాఠాల బోధన మొదలుపెట్టింది. రాష్ట్రంలో మాత్రం 1, 2 తరగతులకు బోధనను విస్మరించారు.

ప్రయోజనం ఉంటుంది
1, 2 తరగతులకు కూడా టీవీల ద్వారా పాఠాలు ప్రసారం చేస్తే.. కొద్దిగా సమయం కేటాయించే తల్లిదండ్రులు ఉన్న కుటుంబాల్లోని పిల్లలకు ప్రయోజనం ఉంటుంది. ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యత అప్పగించాలి.

- రాజిరెడ్డి, టీఎస్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

వారిని అలానే వదిలేస్తారా?
టీవీల ద్వారా గంటపాటు పాఠాలు వినడం, చూడటం వల్ల నష్టం లేదు. ఆ పాఠాలు లేకున్నా టీవీ చూడని పిల్లలు లేరు. మరో రెండేళ్లు కరోనా పరిస్థితులు ఇలాగే కొనసాగి.. పాఠశాలలు తెరవకుంటే వారిని వదిలేస్తారా? ఒకటి, రెండు తరగతుల వారికి చిన్న కథలు, పాటలు, బొమ్మలు చూపడం, ఆటలు లాంటివి చూపితే ఆసక్తిగా చూస్తారు. కొత్త పదాలు నేర్చుకుంటారు.

- ఉపేందర్‌రెడ్డి, విశ్రాంత ఆచార్యులు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి

ఒకటో తరగతికీ టీవీ పాఠాలుండాలి
నూతన విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఆన్‌లైన్‌ పాఠాలు మొదలుపెట్టాలి. అసలు లేకపోవడం కంటే టీవీ పాఠాలుంటే కొంతవరకైనా ప్రయోజనం కలుగుతుంది. దీనిపై ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌ ద్వారా విన్నవించా.

- ఖమ్రోద్దీన్‌, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్‌జీటీ ఫోరమ్‌

ఇదీ చదవండి:

పది పరీక్షలా? ఇంటరా?

ABOUT THE AUTHOR

...view details