ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్​.. అక్కడి నుంచే ఆర్డర్లు - ఆక్సిజన్​ వార్తలు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొందరు ముందు జాగ్రత్తగా ఇళ్లల్లో ఆక్సిజన్‌ సిలిండర్లు సమకూర్చుకుంటున్నారు. ఇప్పటికే ఆస్తమా, హృద్రోగం, బీపీ తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారే కాకుండా ఇతరులు కూడా వీటిని కొని పెట్టుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంట్లోనే చికిత్సకు అనుమతించిన క్రమంలో ఇలాంటి జాగ్రత్తలో ఉన్నారు. ధనిక ప్రాంతాల నుంచి ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయని విక్రేతలు చెబుతున్నారు.

తెలంగాణలో ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్​.. అక్కడి నుంచే ఆర్డర్లు
తెలంగాణలో ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్​.. అక్కడి నుంచే ఆర్డర్లు

By

Published : Jun 15, 2020, 5:39 AM IST

ఆక్సిజన్‌ సిలిండర్లు సాధారణంగా ఆసుపత్రుల్లో అత్యవసర రోగులకు వినియోగిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకు ఇంట్లో కూడా అత్యవసరానికి ఆక్సిజన్‌ ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. శ్వాసలో ఇబ్బంది వస్తే అప్పటికప్పుడు కృత్రిమశ్వాస అమర్చుకుంటారు. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కొందరు ముందు జాగ్రత్తగా ఆక్సిజన్​ సిలిండర్లు సమకూర్చుకుంటున్నారు.

ఆస్తమా సమస్య ఉన్న ఒక రిటైర్డ్‌ ఉద్యోగి కొద్దిరోజుల క్రితం 5 లీటర్ల సామర్థ్యం ఉన్న ‘ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌’ కొన్నారు. ధర రూ. 48,000. ఇప్పుడు వీటి ధర రూ.60,000కు పెరిగినట్లు హైదరాబాద్‌కు చెందిన ఓ డీలర్‌ చెప్పారు. అదేమని అడిగితే ఒక్కసారిగా కొనుగోళ్లు పెరగడంతో ధరలు పెరిగాయని బదులిచ్చారు. కొందరు వీటిని అద్దెకు కూడా సరఫరా చేస్తుంటారు. సిలిండర్‌, ఇతర పరికరాలతో కలిపి పరిమాణాన్ని బట్టి అద్దె నెలకు రూ.2,000-3,000 వరకు వసూలు చేస్తున్నారు. రీఫిల్లింగ్‌కు పరిమాణం ప్రకారం రూ. 400 నుంచి రూ. 1,000 వరకు ఖర్చవుతోంది.


ఇదీ రెండింటికీ తేడా..

ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ విద్యుత్తుతో నడుస్తుంది. ఆక్సిజన్‌ అయిపోతుందన్న బెంగ ఉండదు. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఆక్సిజన్‌ ప్యూరిటీ సిలిండర్లలో 99 శాతం వరకు ఉంటే, కాన్సన్‌ట్రేటర్‌లో నాలుగైదు శాతం తక్కువ ఉంటుంది. హైదరాబాద్‌ డీలర్లు అమెరికా, చైనా తదితర దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నారు.

రెండు వారాల నుంచి ఆర్డర్లు..

హైదరాబాద్‌లో 40కి పైగా ఆసుపత్రులకు నిత్యం 500 సిలిండర్లు సరఫరా చేస్తుంటాం. కొవిడ్‌ నేపథ్యంలో ఎందుకైనా మంచిదని కొందరు ఇంట్లో ఆక్సిజన్‌ ఏర్పాటు చేసుకుంటున్నారు. రెండువారాల నుంచి ఈ ధోరణి పెరిగింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ తదితర ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల కోసం రోజుకు అరడజను ఆర్డర్లు వస్తున్నాయి. - మహ్మద్‌ ముజీబ్‌ఖాన్‌, ఆక్సివిజన్‌ మెడికల్‌ సర్వీసెస్‌

డిమాండ్‌ పెరుగుతోంది..


చిన్న ఆసుపత్రుల నుంచి, వ్యక్తిగతంగా కొందరి నుంచి కూడా ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం ఆర్డర్లు వస్తున్నాయి. రీఫిల్లింగ్‌కు 5 లీటర్ల సిలిండర్‌కు రూ.400, 10 లీటర్లకు రూ.500 ఛార్జి ఉంది. సిలిండర్‌ అద్దె అదనం. లాక్‌డౌన్‌ ప్రారంభంలో రూ. 48,000 ధర ఉన్న ఓ కంపెనీ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ (5 లీటర్లు) ఇప్పుడు రూ.60,000కు చేరుకుంది.- మీర్జా, ఫార్చూన్‌ ఎంటర్‌ప్రైజెస్‌, సికింద్రాబాద్‌

వైద్యుల పర్యవేక్షణలోనే ఉపయోగించాలి

ఇంట్లో ఆక్సిజన్‌ను కేవలం అత్యవసర సమయాల్లో అదీ వైద్యులు, సిబ్బంది పర్యవేక్షణలోనే వినియోగించాలి. లేకపోతే చాలా ప్రమాదం. రోగి ఆరోగ్య పరిస్థితి, శరీరంలో ఆక్సిజన్‌ శాతం ఎంతమేర ఉంది.. ముందునుంచే జబ్బులున్నాయా.. వంటి విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఆక్సిజన్‌ను ఎంతమోతాదులో ఓపెన్‌ చేయాలి, రోగికి ఎంత ఇవ్వాలన్నది ముఖ్యమైన అంశం. ఆరోగ్యాన్ని బట్టి మోతాదు నిర్ణయిస్తారు. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, పోర్టబుల్‌ సిలిండర్లను నేరుగా ఇంటికి తెచ్చుకుని సొంతంగా వినియోగించొద్దు. సిలిండర్లలో ఎక్కువ పీడనంతో ఉండే ఆక్సిజన్‌ లీకైతే అగ్నిప్రమాదాలు కూడా జరగవచ్చు. - డాక్టర్‌ మనోహర్‌, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ (జనరల్‌ మెడిసిన్‌)

ఇవీ చూడండి:

రూ.5 కోట్లతో కపిరాజుల పార్క్ నిరిస్తోన్న ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details