ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్‌చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఆర్‌జీయూకేటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెసి రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌లో యూనివర్సిటీలను ఉన్నత స్థానానికి తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి జగన్ చర్చించారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ప్రమాణాలను అధికారులు సీఎంకు వివరించారు. కాకినాడ, అనంతపురం జేఎన్టీయూ యూనివర్సిటీలు, ఆంధ్రా యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీతో పాటు... ట్రిపుల్ ఐటీలను ఇప్పడున్న పరిస్థితి నుంచి మెరుగైన పరిస్థితిలోకి తీసుకువెళ్లడంపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎన్ని నిధులు అవసరమో చెప్పాలన్నారు. కడపలో రానున్న ఆర్కిటెక్చర్ వర్సిటీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు.
ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లో ఏయూ ప్రస్తుతం 19వ స్థానంలోనూ, ఎస్వీ యూనివర్సిటీ 38వ స్థానంలోనూ ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. రెండేళ్లలో వీటి స్థానాలు గణనీయంగా మెరుగుపడడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లో ఉత్తమ స్థానాల్లో ఉన్న యూనివర్సిటీలలో పద్ధతులను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. మౌలిక సదుపాయాలు, బోధనా పద్ధ్దతులు, బోధనా సిబ్బంది తదితర అంశాల్లో తీసుకోవాల్సిన పద్దతులపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతిభ ఉన్న వారినే యూనివర్సిటీల్లో బోధనా సిబ్బందిగా నియమించాలని సూచించారు. ప్రతిభావంతులను ఎంపిక చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నియామకాల కోసం పటిష్ట పద్దతులను రూపొందించాలన్నారు.
విదేశాల్లోని అత్యుత్తమ యూనివర్సిటీల పద్ధతులను, విధానాలను అధ్యయనం చేసి వాటిని మన యూనిర్సిటీల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ సూచించారు. వారి పాఠ్య ప్రణాళికలను ఇక్కడ అనుసంధానం చేసుకోవడంపైనా దృష్టి పెట్టాలన్నారు. బోధనతో పాటు, కోర్సులకు సంబంధించి విదేశీ వర్సిటీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలన్నారు. శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్ ఐటీల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ట్రిపుల్ ఐటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న సీఎం.. ట్రిపుల్ ఐటీలకు సంబంధించి 180 కోట్లకు పైగా నిధులను మళ్లించారన్నారు. మళ్లీ ట్రిపుల్ ఐటీలు మెరుగుపడాలని, ఇప్పుడున్న మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని దీని కోసం కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.