అభివృద్ధిపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మూడేళ్లలో 3 ప్రాంతాలకు ఏం చేశారో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతికి కేంద్రం ఎన్నో సంస్థలు, నిధులు ఇచ్చిందని అన్నారు. అమరావతిలో దోచుకోవడానికి జగన్‌కు ఏమీ కన్పించలేదని అందుకే.. జగన్ కన్ను విశాఖపై పడిందని ఆరోపించారు. ప్రజలు అవసరమైనప్పుడు జగన్‌కు తడాఖా చూపిస్తారని హెచ్చరించారు.
వికేంద్రీకరణ పేరుతో విద్వేష రాజకీయాలు వద్దు:రాజధానిపై హైకోర్టు తీర్పును వక్రీకరిస్తున్నారని ప్రభుత్వంపై భాజపా ఎంపీ సుజనా చౌదరి మండిపడ్డారు. కోర్టుల అధికారాలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అమరాతిని ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్ అంగీకరించలేదా? అని ప్రశ్నించారు. సీఆర్డీఏ, రైతులకు మధ్య చట్టబద్ధ ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. సీఆర్డీఏను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు చెప్పిందని.., చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని కోర్టు చెప్పలేదని అన్నారు. వికేంద్రీకరణ పేరుతో విద్వేష రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. రాజధాని అమరావతికి అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందని సుజనా చౌదరి స్పష్టం చేశారు.
వివాదాన్ని పెంచేలా మాట్లాడుతున్నారు:రాజధానిపై సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వివాదాన్ని పెంచేలా సీఎం, మంత్రులు మాట్లాడారని ఆయన మండిపడ్డారు. కోర్టు తీర్పును అమలు చేసి వివాదాలకు ముగింపు పలకాలని హితవు పలికారు. అమరావతికి, అభివృద్ధికి, వికేంద్రీకరణకు ముడిపెట్టడం సరికాదన్నారు. పరిపాలన, శాసన రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్నారు.