రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను... విపక్షాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి తప్పితే... రాజధానుల ఏర్పాటుతో ఏ ప్రాంతానికీ మేలు జరగదని కుండబద్దలు కొడుతున్నాయి. దీనివల్ల ప్రాంతీయ విద్వేషాలు పెచ్చరిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజధానుల ఏర్పాటు నిర్ణయంపై స్పందించిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా... ఈ అంశంలో పూర్తిస్థాయి అధ్యయనం చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో 3 రాజధానుల ఏర్పాటు ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిందన్నారు సీపీఐ సీనియర్ నేత నారాయణ. రాజధానుల నిర్ణయం అమలు కారణంగా ఏపీతోపాటు దేశవ్యాప్తంగా ఎదురయ్యే ఇబ్బందుల గురించి అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. చంద్రబాబు హయాంలో కట్టారనే ఏకైక కారణంతో... అమరావతికి జగన్ మంగళం పాడుతున్నారని నారాయణ విమర్శించారు. ప్రజలపై ప్రేమతో కాకుండా... కసితోనే రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆక్షేపించారు.
రాష్ట్రంలో 3 రాజధానుల ప్రతిపాదన ఖర్చుతో కూడుకున్నదని... రాజకీయం కోసం రాజధానిని వికేంద్రీకరించకూడదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు. 3 రాజధానుల మధ్య మంత్రులు, అధికారులు తిరగడం.. వ్యయప్రయాసలతో కూడుకున్నదనే విషయం మరవరదాన్నారు. దక్షిణాఫ్రికాకు 3 రాజధానులు ఆర్థిక భారమని వాళ్ల పాలకులే చెబుతున్నారని గుర్తుచేశారు.