ఇంటర్ పాఠ్యపుస్తకాల సరఫరాలో ఈ ఏడాది తీవ్ర జాప్యం జరుగుతోంది. రెండో ఏడాది విద్యార్థులకు పుస్తకాలు లేకుండానే ఆన్లైన్ పాఠాలు బోధిస్తున్నారు. పాఠం అర్థం కాకపోతే పునశ్చరణకు పిల్లలకు అవకాశం లేకుండాపోయింది. కొందరు విద్యార్థులు తమ సీనియర్ల వద్ద ఉండే పుస్తకాలను అడిగి తీసుకుంటుండగా.. మిగతావారు అధికారులు ఇచ్చే వాటి కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వ, ఎయిడెడ్, ఆదర్శ పాఠశాలలు , కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలకు ఇంటర్ విద్యాశాఖ ఉచిత పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. దాదాపు 2.50 లక్షల మంది పిల్లలకు పుస్తకాలను అందించాల్సి ఉంది. ఈ ఏడాది ప్రింటింగ్‌కు ఇవ్వడంలో జాప్యం జరగడంతో ముద్రణ పూర్తి కాలేదు. కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యమైనా ఆన్లైన్ తరగతులు మాత్రం కొనసాగుతున్నాయి.