తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిగడ్డల ధర సామాన్యులను కలవర పెడుతోంది. రోజురోజుకి పెరుగుతున్న ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. హైదరాబాద్ మలక్‌పేట్ మార్కెట్‌లో నాణ్యమైన ఉల్లిగడ్డల టోకు ధర క్వింటా 6 వేల రూపాయలకు చేరింది. గత నెలలో గరిష్ఠ ధర 1971 రూపాయలు ఉండేది. ఈ నెలలో ఏకంగా 201 శాతం అదనంగా పెరిగింది. ఇక చిల్లర ధరలను వీధికో తీరుగా అమ్ముతున్నారు.
కిలోకు రూ.80
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు మహారాష్ట్ర నుంచి వచ్చే నాణ్యమైన పెద్ద ఉల్లిగడ్డల ధర 60 రూపాయలు పలుకుతోంది. చిన్నగా ఉండి అంతగా నాణ్యత లేని వాటిని కూడా కిలో 30 రూపాయలకు అమ్ముతున్నారు. దేశవ్యాప్తంగా ముఖ్య నగరాల్లో చిల్లర కిలోకు 80 రూపాయలకు చేరిందని జాతీయ ఉద్యాన మండలి తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఉల్లి ధరల మంటతో విదేశాల నుంచి లక్ష టన్నుల దిగుమతి చేయడమే గాక వాటి నిల్వకు నాణ్యత ప్రమాణాలను సడలించింది.