రైతుల వ్యవసాయ భూముల్లో ఉచితంగా బోర్లు వేసే వైఎస్‌ఆర్ జలకళ పథకం.. అమలులో నీరసిస్తోంది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంవల్ల బోర్లు పడట్లేదు. రోజూ 200 బోర్లు తవ్వే పరిస్థితి నుంచి ప్రస్తుతం పది గగనమవుతున్నాయి. రూ.50 కోట్లకుపైగా బిల్లులు పెండింగులో ఉండటంతో ప్రైవేటు ఏజెన్సీలు ముఖం చాటేస్తున్నాయి. 2.5 ఎకరాల భూమి కలిగి, ఇప్పటివరకు బోరు లేని రైతులకు ఉచితంగా బోర్లు వేసి విద్యుత్తు పంపుసెట్ సమకూర్చాలని జలకళ పథకాన్ని ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా 41 ప్రైవేటు ఏజెన్సీలకు డ్రిల్లింగ్ బాధ్యత అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,79,913 మంది రైతులు దరఖాస్తులు చేశారు. వీరిలో 1,19,338 మంది అర్హులని వీఆర్వోలు నిర్ధారించారు. జిల్లా జల యాజమాన్య సంస్థ (డ్వామా) సహాయ పథక సంచాలకుల (ఏపీవో) సిఫార్సులపై జియాలజిస్టులు నీటి లభ్యతపై సర్వేచేసి నివేదిక ఇస్తారు. ప్రైవేటు ఏజెన్సీలు బోర్లు వేస్తాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు 8,264 బోర్లు తవ్వగా, దాదాపు రూ.7 కోట్ల బిల్లులు చెల్లించారు. మరో రూ.50 కోట్లకు పైగా బిల్లులు పెండింగులో ఉండటంతో ఏజెన్సీలు ముఖం చాటేస్తున్నాయి. బోర్లు వేసే ఏజెన్సీలకు ఇప్పటివరకూ రాష్ట్రస్థాయిలో చెల్లింపులు చేసేవారు. ఇప్పుడు జిల్లాస్థాయిలో చెల్లింపులు, గణాంకాల అధికారి (పీఏవో) నేతృత్వంలో బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది.