ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గురుకులం.. విద్యార్థులకు అందని ఆహారం - Residential Schools Latest News

అధికారుల నిర్లక్ష్యం... గుత్తేదారులు సరకుల సరఫరా నిలిపేయడం వెరసి... సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు ఆకలి కేకలు పెడుతున్నారు. గురుకులాలకు కూరగాయలు, నూనె, పప్పులు, కారం తదితరాలను సరఫరా చేసే గుత్తేదారులకు గత ఏడాది నవంబరు నుంచి బిల్లులు రాకపోవడంతో వారు సరకుల సరఫరా నిలిపేశారు. తూర్పుగోదావరి జిల్లాలో గుత్తేదారుకు రూ.2.50 కోట్ల బకాయి ఉండటంతో సరకుల సరఫరా పూర్తిగా నిలిపేశారు. ప్రధానోపాధ్యాయులు సొంతంగా ఖర్చు చేసుకుని సరకులు తెప్పిస్తున్నారు.

విద్యార్థులకు అందని ఆహారం
విద్యార్థులకు అందని ఆహారం

By

Published : Apr 15, 2021, 5:03 AM IST

రాష్ట్రంలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ సాంఘిక సంక్షేమ గురుకులాలకు సరకులు పంపిణీ చేయబోమని గుత్తేదారులు తేల్చిచెప్పారు. జిల్లా అధికారులు వారికి సర్దిచెబుతూ నెట్టుకొస్తున్నారు. ఇతర జిల్లాల్లోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది. సరకులను సక్రమంగా సరఫరా చేయనందుకు జిల్లా అధికారులు మెమోలు జారీ చేసినా ఫలితం ఉండడం లేదు. రూ.కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉంటే సరకులు ఎలా సరఫరా చేస్తామని ప్రశ్నిస్తున్నారు.

బిల్లుల అప్‌లోడింగ్‌లో జాప్యం..

సరకుల సరఫరా నిలిచిపోయి విద్యార్థులు అవస్థలు పడడానికి గురుకులాల అధికారుల నిర్లక్ష్యమే కారణం. అన్ని జిల్లాల గుత్తేదారులకు సంబంధించిన రూ.27 కోట్ల బిల్లుల్ని ఇంతవరకూ సీఎంఎఫ్‌ఎస్‌కు పంపలేదని సమాచారం. కాంట్రాక్టర్లు సరఫరా చేసిన సరకుల బిల్లులను ప్రిన్సిపాళ్లు జిల్లా అధికారులకు పంపించాక... అక్కడి నుంచి తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యాలయానికి వస్తాయి. అక్కడ అధికారులు పరిశీలించి సీఎంఎఫ్‌ఎస్‌కు పంపాల్సి ఉంటుంది. గత నాలుగు నెలలుగా ఈ ప్రక్రియ జరగలేదని తెలిసింది. బిల్లుల చెల్లింపు నిలిచిపోతే సరకుల సరఫరాపై ప్రభావం పడుతుందని తెలిసినా అధికారులు మిన్నకున్నారు.

ప్రశ్నార్థకమైన మెనూ అమలు..

సరకుల సరఫరా జరగక కొన్నిచోట్ల ప్రధానోపాధ్యాయులే సొంతంగా జేబు నుంచి ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక భారం మోయలేక...మెనూలో కోత విధిస్తున్నారు. విద్యార్థులకిచ్చే పళ్లు, అల్పాహారంలో కోత విధిస్తున్నారు. సాయంత్రం వేళ రాగిజావ వంటివి ఇవ్వడం లేదు. తమ జేబు నుంచి చేసిన ఖర్చులకూ చెల్లింపులు సరిగా లేవని పలువురు ప్రధానోపాధ్యాయులు వాపోయారు.

టెండరు విధానం మార్చినా ఇబ్బందులే..

గతంలో కేంద్రీకృత టెండరు విధానం ద్వారా గురుకులాలకు వంట సరకులు సరఫరా చేసే విధానం ఉండేది. సరఫరాలో జాప్యం చేయడంతో అధికారులు ఆ సంస్థను తొలగించారు. గతేడాది నవంబరు నుంచి జిల్లాల వారీగా టెండర్లను పిలిచారు. టెండరు విధానం మార్చినా... 6నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో సరకులు ఇచ్చేందుకు గుత్తేదారులు నిరాకరిస్తున్నారు. వంట సిబ్బందికి సైతం ఆరు నెలలుగా వేతనాలు అందలేదు.

అన్నం పెట్టలేక సెలవు..

విద్యార్థులకు భోజనం సమకూర్చలేక తూర్పుగోదావరి జిల్లా తుని మండలం వి.కొత్తూరులోని బాలయోగి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలకు రెండు రోజుల సెలవు ప్రకటించారు. ఈ గురుకులానికి సరకుల సరఫరా నిలిచిపోయింది. అర్ధాకలితో అలమటిస్తున్న పిల్లలను మంగళవారం కొందరు తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారు. అధికారుల సూచన మేరకు పాఠశాలకు రెండు రోజులు సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ నిర్మలకుమారి తెలిపారు. మొత్తం 540 మంది విద్యార్థినుల్లో 300 మంది మంగళవారమే ఇంటికి వెళ్లిపోగా మిగిలిన వారు బుధవారం వెళ్లిపోయారు.

ఇదీ చదవండీ... క్లైమాక్స్​కు తిరుపతి ఉపఎన్నిక ప్రచారం..17న పోలింగ్​

ABOUT THE AUTHOR

...view details