తెలంగాణ విమోచనోద్యమంలో పోరాట వీరులు నిజాంపై ఆయుధాలను ఎక్కుపెడితే, కవులు, కళాకారులు తమ కలాలనే ఆయుధాలుగా మార్చుకున్నారు. చుర కత్తుల్లాంటి పాటలు, గేయాలతో ప్రజల్లో విప్లవాగ్నిని రగిలించారు. కవిత్వం, కథ, పాట, నాటకం నాటిక ఇలా అన్ని సాహిత్య ప్రక్రియలతోనూ ఉద్యమానికి ఊపిరులూదారు. బుర్రకథ, హరికథ, ఒగ్గుకథ, వీధి భాగవతం, బుడబుక్కలకథ లాంటి రూపకాలతో జనాన్ని కదిలించారు. నవలా ప్రక్రియలోనూ జనజీవితాన్ని ప్రతిబింబించారు. మా నిజాము రాజు తరతరాల బూజు అంటూ దాశరధి చేసిన కవితా సింహనాదం జనం గుండెల్లో ప్రతిధ్వనించింది. అలా కవులు, అటు కళాకారుల తెలంగాణ సాయుధ పోరాటానికి తమవంతుగా సమిధలను అందించారు. గ్రామానికో కవి, ఇంటికో కళకారుడన్నట్లు చదువు, సంధ్యలు లేనివారు కూడా పాటలు కట్టి ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. బండెన బండికట్టి పదహారు బండ్లు కట్టి అనే గేయం రాసింది నిరక్షరాస్యుడైన యాదగిరి. ఈ పాట నైజాం సర్కారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.
దేశ్‌ముఖ్‌లు, జమీందారులకు వెట్టి చాకిరి చేస్తూ.. పసిమొగ్గలు సైతం వాడిపోతున్న వైనాన్ని, బాల కార్మికుల కష్టాలను కళ్లకు కడుతూ.... పల్లెటూరి పిల్లగాడా, పసులగాసే పోరగాడ అంటూ సుద్దాల హన్మంతు రాసిన గీతం....నాడు అందరి నోళ్లలో నానింది. ఉర్దూ, హిందీ, తెలుగులో ఎన్నో గీతాలు ఉద్యమానికి బాసటగా నిలిచాయి.
నాటి తెలంగాణ ప్రజల కష్టాలకు అద్దం పట్టింది...మా భూమి నాటకం. సుంకర, వాసిరెడ్డి కలిసి రచించిన ఈ నాటకం ఉద్యమ కాలంలో కొన్నివేలసార్లు ప్రదర్శనకు నోచుకుంది. ఈ నాటకంలో దొర వేషం వేసిన పాత్రధారిని ఆవేశంలో ప్రజలు నిజంగానే చితబాదిన సందర్భాలు కూడా ఉన్నాయి.