NITI AAYOG: పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని నీతీ ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో పారిశ్రామికవేత్తలు, వివిధ అసోసియేషన్లతో రాజీవ్‌కుమార్ సమావేశమయ్యారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నీతి ఆయోగ్ దృష్టికి తీసుకెళ్లారు.
బియ్యం ఎగుమతులలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని బియ్యం ఎగుమతి దారుల సంఘం ప్రతినిధులు చెప్పారు. వీటిని మరింత ఎగుమతి చేయాలంటే రైల్వే నుంచి ఎక్కువ వ్యాగన్ లు కేటాయించాలని కోరారు. ఇనుము, బొగ్గు, స్టీల్ సరఫరాకే రైల్వే ప్రాధాన్యం ఇస్తోందని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎగుమతుల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రులు, ఎగుమతి దారులతో ఒక సంయుక్త కమిటీ వేయాలని సూచించారు.
ఎమ్ఎస్ఎమ్ఈ సంస్థలకు బ్యాంకులు ఇచ్చే రుణాల వడ్డీ శాతాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని కోరారు. గృహరుణాలకే 6శాతం ఇస్తున్నారని... చిన్న తరహా పరిశ్రమలకు 12శాతం ఇస్తున్నారని దీనిని సవరించాలని నీతిఆయోగ్ దృష్టికి తీసుకెళ్లారు. విభజన తర్వాత కేంద్రం అనేక హామీలు ఇచ్చిందని వాటిని నెరవేర్చాలని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డిమాండ్ చేసింది. 11 జాతీయ విద్యా సంస్థలను మంజూరు చేశారని... వాటి నిర్మాణానికి నిధులు విడుదల కాకపోవడం వల్ల అవి ప్రైవేటు భవనాలలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు.
ఇప్పటి వరకు విశాఖకు రైల్వే జోన్ ఇంతవరకు మంజూరు చేయలేదని దీనిని త్వరగా చేయాలని కోరారు. పరిశ్రమల అవసరాలు తీర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని రాజీవ్ కుమార్ చెప్పారు. పరిశ్రమల ఊతానికి కేంద్రం అందించిన ప్రోత్సాహక పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పరిశ్రమలు ఆశించిన రీతిలో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నిబంధనలు మరింత సరళతరం చేయటానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందిన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు.
ఇదీ చదవండి:తిరుమలకు వెళ్లేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఈవో