కాన్పు కోసం తన సొంత దేశం వెళ్తున్న గర్భిణి.. పురిటి నొప్పులు రావటంతో మార్గ మధ్యలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. నేపాల్‌కు చెందిన అనితా దేవి.. ఇటీవల కర్నాటకలోని యశ్వంత్‌పూర్‌కు వచ్చింది. ఇన్నిరోజులూ సమీప బంధువుల ఇంట్లో ఉన్న అనితకు నెలలు నిండాయి. వైద్యులు ఆమెకు ఈ నెల 30న కాన్పు తేదీ ఇచ్చారు.
రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తి
తన కాన్పు నేపాల్‌లో జరగాలనే ఉద్దేశంతో యశ్వంత్‌పూర్, లక్నో ప్రత్యేక రైలులో అనిత లక్నో బయలు దేరింది. అక్కడి నుంచి సొంత దేశానికి బయలుదేరాలనుకుంది. గురువారం తెల్లవారుజామున విజయవాడ దాటిన తర్వాత ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. గమనించిన టీసీ.. ఖమ్మం రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు 108 వాహనంతో సిద్ధంగా ఉన్నారు. రైలును ఖమ్మంలో ఆపి వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలోని మతాశిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు ఆమెకు సాధారణ కాన్పు చేశారు. మగ బిడ్డకు జన్మనిచ్చింది. రైల్వే సిబ్బంది ఆమెకు సపర్యలు చేసి.. బాలింతకు తోడుగా ఉన్న మహిళకు వసతి కల్పించారు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశాక వారిని లక్నో పంపిస్తామని రైల్వే అధికారులు చెప్పారు. సమయానికి రైల్వే పోలీసులు ఆస్పత్రికి తీసుకురావటం వల్ల తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. రైల్వే సిబ్బందిని అభినందించారు. అనితా దేవికి అంతకు ముందు ఒక బాబు, పాప ఉన్నారు.
ఇదీ చదవండి:రామమందిర విరాళాలపై ఎమ్మెల్యే వివాదాస్పద కామెంట్లు'