కరోనాపై ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ... ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్న పాత్రికేయులు కరోనా బారినపడి మృతి చెందడం బాధాకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. తిరుపతి పాత్రికేయుడు సుబ్రమణి మృతిపట్ల సంతాపం తెలిపిన ఆయన... వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మీడియా సిబ్బందిని కరోనా వారియర్స్ జాబితాలో చేర్చి, వారికి కరోనా బీమా పథకాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇప్పటికే కరోనాతో మృతిచెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య పథకం, ప్రమాద బీమా పథకాలను వెంటనే పునరుద్ధరించి వైద్య, ఆరోగ్య భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించాలని తెదేపా శాసనసభ్యులు బెందాళం అశోక్ డిమాండ్ చేశారు.