అచ్చెన్నాయుడుని ఎలాగైనా జైలులో పెట్టాలని జగన్ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లిన ఆయన... ఆసుపత్రి అధికారులను కలిసి అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అచ్చెన్నాయుడుకు అందిస్తున్న చికిత్స, ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆసుపత్రి అధికారులకు వినతిపత్రం అందజేశారు.
అచ్చెన్నాయుడిపై కేసులు కక్షసాధింపు చర్యలో భాగమేనని ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించినా...ఆస్పత్రి సూపరింటెండెంట్ సంతకం లేకుండా, కిందిస్థాయి అధికారుల పేరిట నివేదిక పంపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అచ్చెన్నాయుడిని ఎలాగైనా జైలులో పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
శస్త్ర చికిత్స చేయించుకున్న వ్యక్తిని వందల కిలోమీటర్లు తీసుకువచ్చారని... న్యాయమూర్తి చెబితే గాని ఆసుపత్రికి తీసుకెళ్లలేదని మండిపడ్డారు. ఆసుపత్రిలో ఉన్న వ్యక్తిని అర్థరాత్రి సమయంలో డిశ్చార్జి చేసేందుకు యత్నించటాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ కుట్రలకు భయపడేది లేదని.. చట్టపరంగా పోరాడతామని ఎంపీ స్పష్టం చేశారు.
ఎర్రన్నాయుడు సంతకం చేశారు కాబట్టే ఆ కుటుంబంపై కక్ష
ఒకప్పుడు సీఎం జగన్‌పై అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఎర్రన్నాయుడు సంతకం చేశారు కాబట్టే ఆ కుటుంబంపై కక్ష సాధిస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఇందులో భాగంగానే అచ్చెన్నాయుడిపై కేసు పెట్టి అరెస్టు చేశారన్నారు. అవినీతి జరిగినట్లు ఆధారాలు లేకపోయినా కేసులు పెట్టారని విమర్శించారు.
అవినీతి బురదలో ఉన్న వైకాపా ప్రభుత్వం.. మా పార్టీ నాయకుడిపై బురద చల్లుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని దేవినేని హెచ్చరించారు.