అశోక్ గజపతిరాజు ఇచ్చిన విరాళాన్ని వెనక్కి పంపడం భక్తుల్ని అవమానించడమేనని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. భక్తులు ఇచ్చిన విరాళాలను తిరస్కరించడం దేశంలో ఇదే ప్రథమమని మండిపడ్డారు. నిందితులను పట్టుకోవడం చేతకాని మంత్రి వెల్లంపల్లి.. పదవి కాపాడుకోవడానికి జగన్ జపం చేస్తున్నారని విమర్శించారు. పవిత్రమైన దేవాదాయశాఖను తన వ్యహారాలశైలితో అపవిత్రం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూ మతాన్ని ఉద్దరిస్తున్నట్లు ప్రజల ముందు ముఖ్యమంత్రి బాగా నటిస్తున్నారని విమర్శించారు. నిందితులను పట్టుకోకుండా ముఖ్యమంత్రి, మంత్రి ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు ధ్వజమెత్తారు. 150 ఆలయాలపై దాడులు జరిగితే విచారణకు ఆదేశించలేదని.. నేరం నిగ్గు తేల్చాల్సిన పోలీసుల కంటే ముందే సీఎం, మంత్రులు ప్రతిపక్షంపై నెట్టి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వైకాపా ఇకనైనా తన డ్రామాలు కట్టిపెట్టి అన్ని మతాల గౌరవాన్ని కాపాడాలని మంతెన డిమాండ్ చేశారు.