రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తెదేపా హయాంలో ఉద్యోగుల జీతాలు ఆగిన సందర్బం లేదని ఆయన గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వంలో 7వ తేదీన కూడా జీతాలు, పెన్షన్ అందకపోగా... రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులు సైతం చేయడం లేదని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఆపి... కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు 2,800 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారని ఆరోపించారు.
ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నేతలు తొత్తులుగా మారారని అశోక్ బాబు మండిపడ్డారు. కరోనా వల్ల వ్యాపారులు, ప్రజలు మాత్రమే దెబ్బతిన్నారని.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నష్టమూ జరగలేదని వివరించారు. ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి ఉన్నారా లేదా అనే అనుమానం కలుగుతోందన్నారు.