MLA's Brother name Dalit Bandhu Scheme: ఎస్సీల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దళితబంధు పథకం అమలులో కొన్నిచోట్ల అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు తమ అనుచరులు, కార్యకర్తలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జనగామ జిల్లాలో ఎంపిక చేసిన 185 మంది లబ్ధిదారుల జాబితాలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య సోదరుడు, ఘన్‌పూర్ సర్పంచి సురేశ్‌కుమార్ పేరు ఉండటం గమనార్హం. ఈ విషయమై అధికారులను వివరణ కోరగా.. దళితబంధు పథకంలో ఎస్సీల్లో పేదలకే ఇవ్వాలనే నిబంధన లేదని, ప్రభుత్వ ఉద్యోగులు కాని 60 ఏళ్ల లోపు వారు అంతా అర్హులేనని వివరించారు.
ఇటీవల 118 నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తయినప్పటికీ.. జాబితాలో లేని ఇతర ఆశావహ కుటుంబాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న కారణంతో ప్రస్తుతం గోప్యత పాటిస్తున్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తికాలేదని చెబుతున్నారు. ఎమ్మెల్యేలు.. నియోజకవర్గాల్లో తమ అనుచరులను, అనుకూలంగా ఉన్నవారిని ఎంపిక చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్నిచోట్ల నేతల అనుచరులు.. ఎంపిక చేసిన లబ్ధిదారులతో వాటాలు (రూ.2-4 లక్షలు) మాట్లాడుకుంటున్నారన్న విమర్శలూ ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లు చేర్చారని కొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నారాయణపేట, గద్వాలలో పేదలను కాకుండా ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్నవారిని మరోసారి ఎంపిక చేస్తున్నట్లు అక్కడి స్థానికులు పేర్కొంటున్నారు.