ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు మిరప ఎగుమతులు నిలిచాయి. ఇప్పటికే విక్రయించిన మిరపకు చెల్లింపులూ జరగడం లేదు. చైనా కూడా గతేడాదితో పోలిస్తే దిగుమతులు తగ్గించుకుంది. బంగ్లాదేశ్‌కు ఎగుమతులు కొనసాగుతుండడం కొంతమేర ఊరటనిస్తోంది. దీనివల్ల కొన్నాళ్లుగా ధరలు నిలకడగానే ఉన్నా.. గతంతో పోలిస్తే తగ్గుదలే కన్పిస్తోంది. 2020 దసరా సమయంలో.. క్వింటాలు రూ.19వేల వరకు పలికిన తేజ రకం మిరప.. ఇప్పుడు రూ.13వేల నుంచి రూ.14వేలకు చేరింది. మిగిలిన రకాల ధరలూ రూ.3వేల నుంచి రూ.4వేల మేర తగ్గాయి. జూన్‌తో పోలిస్తే క్వింటాలుకు రూ.2వేల వరకు పడిపోయింది. ధరలు పెరుగుతాయనే ఆశతో శీతల గోదాముల్లో నిల్వ చేసిన రైతులు క్వింటాలుకు రూ.3వేలకు పైగా నష్టపోయారు.
శ్రీలంక నుంచి నిలిచిన చెల్లింపులు..
భారత్ నుంచి మిరప ఎగుమతుల్లో చైనా, థాయ్‌లాండ్ తర్వాత శ్రీలంక నిలుస్తుంది. గతేడాది భారత్ నుంచి 6.01 లక్షల టన్నుల మిరప ఎగుమతి చేయగా.. అందులో శ్రీలంకకు 50,835 టన్నులు వెళ్లాయి. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో అధికంగా సాగయ్యే 334 రకంతో పాటు సూపర్ 10 రకం మిరపకు శ్రీలంక నుంచి డిమాండ్ ఉంది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కొన్నాళ్లుగా ఎగుమతులు నిలిచాయి. గతంలో అమ్మిన సరకుకు సంబంధించి రూ.100 కోట్లకు పైగా బకాయిలు ఉంటాయని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. ఎగుమతులు ఆగిపోవడంతో ధరల్లోనూ కొంతమేర తేడా వచ్చింది.