విమర్శలు తప్ప వారు చేసేదేమి లేదు:వెల్లంపల్లి
తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు భాజపా, జనసేన పార్టీలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నిరోధానికి తెదేపానే కృషి చేస్తున్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కరోనా సాకుతో స్థానిక ఎన్నికలు వాయిదా వేయకుండా నిర్వహించాలని మంత్రి డిమాండ్ చేశారు.
ఎక్కడైనా ఎన్నికలంటే అధికార పార్టీ ముందుకు రాదని.. అలాంటిది విచిత్రంగా రాష్ట్రంలో ప్రతిపక్షం పారిపోతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవాచేశారు. కరోనా వైరస్ నిరోధానికి తెదేపా కృషి చేస్తున్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెదేపా ఆదేశాల మేరకే ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్నారని అనిపిస్తోందన్న మంత్రి... చంద్రబాబుకు లబ్ది కలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆక్షేపించారు. 9 నెలల పరిపాలన పై తాము ఎన్నికలకు వెళ్తున్నామని, భాజపా, జనసేన ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు చేయడం మినహా మరేమీ చేయడం లేదని విమర్శించారు. ఎన్నికల కమిషనర్ కరోనా సాకుతో వాయిదా వేయకుండా నిర్వహించాలని మంత్రి డిమాండ్ చేశారు.