జల జీవన్ మిషన్ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను హెచ్చరించారు. అధికారుల స్థాయిల్లో లక్ష్యాలు నిర్దేశించుకుని గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. సచివాలయంలో రాష్ట్రంలో జల జీవన్ మిషన్ అమలుపై ఆయన సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వమిచ్చిన గడువులోగా జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు.
రెండ్రోజుల్లో టెండర్లు పిలిచి వీలైనంత వేగంగా పనులు మొదలు పెట్టాలని మంత్రి సూచించారు. పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఎంతటివారి పైనైనా కఠిన చర్యలు తీసుకోడానికి వెనుకాడేదిలేదని స్పష్టం చేశారు. జల జీవన్ మిషన్ పనులు 2021 జనవరి 11 లోగా పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యం నిర్దేశించిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో డిసెంబర్ 31 నాటికే ఈ పనులు పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకోవాలని సూచించారు.