ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు నారా లోకేశ్ వాస్తవాలు తెలుసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు హితవు పలికారు. గత ప్రభుత్వ జీవో సహా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పంట నష్టపరిహారం ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజల్లో, రైతుల్లో అపోహలు సృష్టించి లబ్ధిపొందాలని లోకేశ్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో పంట నష్టపోయిన రైతులకు ఏళ్లు గడిచినా పరిహారం అందించలేదని.. పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని సీఎం జగన్ చెల్లించారని గుర్తు చేశారు.
'నేరుగా రైతుల ఖాతాల్లోకి పంట నష్ట పరిహారం' - Kannababu comments on Lokesh
రూ.1251 కోట్ల పంటల బీమా పరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో సీఎం జగన్ త్వరలోనే జమ చేస్తారని... వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతుల జాబితాను ఈ నెల15న ప్రదర్శించి, 31న సంబంధిత రైతులకు పరిహారం అందిస్తామన్నారు. ౩౩శాతం పంట నష్టపోతేనే నష్ట పరిహారం ఇవ్వాలని చంద్రబాబే జీవో ఇచ్చారని.. దీన్నే తాము అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
రైతుల గురించి మాట్లాడే అర్హత లోకేశ్‌కు లేదని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. రూ.3వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని వివరించారు. ధాన్యం కొనుగోలుపై అబద్ధాలు చెబుతున్నందుకు రైతులకు లోకేశ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో దివిస్ పరిశ్రమను పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వమే నిర్ణయించిందని గుర్తు చేశారు. ఇప్పడు విమర్శలు చేస్తోన్న యనమల పరిశ్రమ వద్దని అప్పట్లో ఎందుకు చెప్పలేదని నిలదీశారు.
ఇదీ చదవండీ.. 'తెదేపా నేతలు గతం మర్చిపోయినట్లున్నారు'