జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షతో భూ వివాదాలకు ముగింపు పలికే అవకాశముందని మంత్రుల కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. భూముల సమగ్ర రీసర్వేపై మంత్రుల కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, కృష్ణదాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వందేళ్ల తర్వాత ఇలాంటి భూ సర్వే జరుగుతోందని మంత్రులు అన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్, రోవర్ల సహకారంతో భూసర్వే నిర్వహిస్తున్నట్టు కమిటీ తెలియజేసింది. రాష్ట్రంలో మొత్తం 70 కార్స్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ముందుగా గ్రామాల సరిహద్దుల గుర్తింపునకు చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది. సమగ్ర సర్వే కోసం 13,371 పంచాయతీ కార్యదర్శులు, 10,935 మంది డిజిటల్ అసిస్టెంట్లు, 10,185 మంది గ్రామ సర్వేయర్లకు బాధ్యతలు అప్పగించారన్నారు. ఇప్పటి వరకు 736 గ్రామాల్లో ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌లు సిద్ధం అయినట్టు మంత్రుల కమిటీ నిర్ధరించింది. 240 గ్రామాలకు చెందిన విలేజ్ మ్యాప్‌లు సిద్ధం చేసినట్టు అధికారులు వివరించారు.