రాష్ట్రాలూ కొవిడ్ వల్ల అప్పులు చేయాల్సి వచ్చిందని చెప్పారు. కొవిడ్ వల్ల ప్రపంచమంతా ఇలాగే ఉందని, ఆ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసునని అన్నారు. ఏటా రూ.6లక్షల కోట్ల అప్పులు చేసే కేంద్రం.. ఈ ఏడాది రూ.12 లక్షల కోట్లు అప్పు చేసిందని గుర్తుచేశారు. పత్రికలలోను, ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రం అప్పులు చేస్తోందని ప్రచారం చేస్తున్నట్లు ఆయన శుక్రవారం విజయవాడలో విలేకర్లతో అన్నారు. కొవిడ్ సమయంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో మొత్తం ఆర్థిక వ్యవస్థ స్తంభించిందని, ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు మరింత అండగా నిలవాలని నిర్ణయించారని అన్నారు. కొన్ని రాష్ట్రాలు సంక్షేమ పథకాలు నిలిపివేస్తే మన ముఖ్యమంత్రి ఈ సమయంలోనే పేదలకు అండగా ఉండేలా పథకాలు అమలు చేయాల్సిందేనని చెప్పారన్నారు. వివిధ పథకాల రూపంలో ప్రజలకు రూ.కోట్ల సొమ్ములు అందించడం వల్ల ఆ నిధులు ఆర్థిక వ్యవస్థలోకి వచ్చి గాడిన పడుతోందని, ఆర్థికవేత్తలూ ఇదే విషయం చెప్పారని అన్నారు. పేదలకు సాయం చేసేందుకే అప్పులు చేశామని గర్వంగా చెబుతున్నామని బుగ్గన ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో ఆదాయాలు లేకపోయినా ప్రజలకు నేరుగా లబ్ధి కల్పించామన్నారు.
పరిమితి దాటింది నిజమే
రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రుణాల వాటా 28% మించకూడదని, ప్రస్తుతం 32.7% ఉందని మంత్రి చెప్పారు. అదే సమయంలో పంజాబ్ (38.7), రాజస్థాన్ (34.5), ఉత్తర్‌ప్రదేశ్ (33.1), పశ్చిమబెంగాల్ (34.7) మన కన్నా దారుణంగా ఉన్నాయన్నారు. ద్రవ్యలోటు క్రమేణా తగ్గుతోందని చెప్పారు. మొదటి త్రైమాసికంలో మైనస్ 12.96% ఉంటే నాలుగో త్రైమాసికానికి మైనస్ 3%కు తగ్గించగలిగామని చెప్పారు. జీఎస్టీ వసూళ్లలో దేశంలో రెండోస్థానంలో ఉన్నామన్నారు. ఈ విషయంలో జాతీయసగటు కన్నా రాష్ట్ర సగటు ఎక్కువగా ఉందన్నారు.