generic medicine: మహేశ్‌ది మధ్య తరగతి కుటుంబం. ఎంతో ఒత్తిడితో కూడుకున్న జీవన విధానం కావడంతో అధిక రక్తపోటు, మధుమేహం బారినపడ్డాడు. వాటికి క్రమం తప్పకుండా వైద్యుల సలహా మేరకు మందులు వాడుతున్నాడు. ప్రతి నెలా రూ.2,500 నుంచి రూ.3,000 వరకూ ఖర్చవుతోంది. ఏడాదిన్నర క్రితం ఇంత ఖర్చు ఉండేది కాదు. కానీ, కొవిడ్ దెబ్బకు ఔషధాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఇది ఒక్క మహేశ్‌కు మాత్రమే ఎదురైన సమస్య కాదు.. ఉరుకులు, పరుగులతో కూడుకున్న ప్రస్తుత జీవన విధానంలో ఎంతో మంది జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్నారు. వీటికి నిత్యం మందులు వాడాల్సి వస్తుంటుంది. ఒకవైపు ఔషధ ధరలు ఆకాశాన్నంటుతుండగా.. మరోవైపు సరసమైన ధరల్లో అందించాలనే లక్ష్యం నీరుగారిపోతోంది. జనరిక్ మందుల అందుబాటు.. వాటి వినియోగంవైపు ప్రజలను ప్రోత్సహించే చర్యలు మృగ్యమవుతున్నాయి. దీనిపై తక్షణం దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకతను ప్రస్తుత పరిస్థితులు నొక్కి చెబుతున్నాయి.
హైబీపీని అదుపు చేయటానికి ఎక్కువగా వినియోగిస్తున్న టెల్మిసార్టన్, రామిప్రిల్.. తదితర ఔషధాలు బ్రాండెడ్ కంటే సగం ధరకే ‘జనరిక్’లో లభ్యమవుతున్నాయి. అలెర్జీ, దగ్గు.. తదితర లక్షణాలకు వాడే మాంటెలూకాస్ట్, లెవోసిట్రెజిన్ సమ్మిళిత ఔషధాలు నాలుగో వంతు ధరకే దొరుకుతున్నాయి. మొత్తంగా బ్రాండెడ్‌తో పోల్చితే జనరిక్ మందుల ధరలు 30-90 శాతం తక్కువ. పనితీరులో ఎలాంటి వ్యత్యాసం ఉండదు.
మూడొంతుల ఖర్చు మందులకే
ఇటీవల విడుదలైన ‘నేషనల్ హెల్త్ అకౌంట్స్’ సమాచారం ప్రకారం.. రోగులు చికిత్స కోసం పెట్టే మొత్తం ఖర్చులో 36.8 శాతం మందుల వాటా ఉంటున్నట్లు వెల్లడైంది. అంటే మొత్తం వైద్య ఖర్చుల్లో మూడో వంతు మందుల వ్యయమే ఉంటున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉదాహరణకు మధుమేహ చికిత్సలో వినియోగించే ‘గ్లిమిపిరైడ్+ మెట్‌ఫార్మిన్ 2ఎంజీ/1000ఎంజీ’ ఔషధ ధర బ్రాండెడ్‌లో 10 మాత్రలకు రూ.60-100 వసూలు చేస్తున్నారు. రోజుకు రెండు చొప్పున నెలకు 60 మాత్రలు వాడాల్సి ఉంటుంది. అప్పుడు వీటి ధరే రూ.360-600 వరకూ అవుతోంది. ఇలా ఏ ఔషధాన్ని తీసుకున్నా ధరలు మండిపోతున్నాయి.
ఫలితమివ్వని చర్యలు
ప్రజలకు మందుల ధరల భారం తగ్గించే లక్ష్యంతో దాదాపు పదేళ్ల క్రితమే జనరిక్ ఔషధాలకు ప్రాచుర్యం కల్పించాలని కేంద్రం ప్రయత్నాలు చేపట్టింది. జన ఔషధి దుకాణాలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయటం, దేశీయ ఫార్మా కంపెనీలను జనరిక్ ఔషధాలు ఉత్పత్తి చేసే దిశగా పోత్సహించటం వంటి నిర్ణయాలను అమలు చేసింది. కానీ ఇవి ఆశించినరీతిలో ముందుకు సాగలేదు.
జనరిక్ మందులంటే..