తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ కూలర్ల దుకాణంతో పాటు పక్కనే ఉన్న చైనా బజార్‌లో మంటలు చెలరేగి అగ్నికి ఆహుతయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిఉంవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఈ ప్రమాదంపై బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై లోతుగా విచారణ జరపాలని కోరుతున్నారు. ఈ ఘటనలో రూ. 40 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, దుకాణాలు ప్రధాన రహదారి పక్కను ఉండడంతో పోలీసులు ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేయించి, వాహనాల రాపోకలను రద్దు చేశారు.