Manchu Vishnu Meeting With CM : తాడేపల్లిలోని సీఎం నివాసంలో జగన్‌తో 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు భేటీ అయ్యారు. 'మా' అధ్యక్షుడిగా ఎన్నికయిన తరువాత మూడోసారి ముఖ్యమంత్రిలో భేటీ అయినట్లు విష్ణు తెలిపారు. సీఎం జగన్‌తో భేటీ వ్యక్తిగతమని స్పష్టం చేసిన విష్ణు.. ప్రభుత్వం తరఫున నాన్నకు ఆహ్వానం వచ్చినా.. కొందరు అడ్డుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వ్యక్తిగత కారణాలతో సీఎంను కలిశా. సినీ రంగం అంశాలు చర్చకు వచ్చాయి. సీఎంతో చర్చకు వచ్చిన అంశాలపై మరోసారి చెబుతా.తిరుపతిలో స్టూడియో కడతా.. ప్రభుత్వ మద్దతు కోరుతా. శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థ యూనివర్సిటీగా మారింది. ఆసియాలోనే ఉత్తమ ఫిల్మ్ కోర్సులు, ఫిల్మ్ డిగ్రీలు మొదలుపెడతాం.. నటులుగా ప్రతి తెలుగు వ్యక్తి మాకు కావాల్సిన వారే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాకు రెండు కళ్లు. సినీ పరిశ్రమకు విశాఖలో అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. కార్యాచరణపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో చర్చిస్తాం.ఈ సమావేశానికి నాన్నగారితో పాటు, మరో ఇద్దరు ముగ్గురు హీరోలకూ ఆహ్వానం పంపారు. కానీ, ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఆ ఆహ్వానాన్ని నాన్నకు అందకుండా చేశారు. అలా ఎవరు చేశారో మాకు తెలుసు. దీనిపైనా చర్చిస్తా" - మంచు విష్ణు, 'మా' అధ్యక్షుడు
టిఫిన్ చేసేందుకు వచ్చారు..
ఇటీవల మంత్రి పేర్నినాని తమ ఇంటికి వచ్చి కలిసినప్పుడు కొన్ని మీడియా సంస్థలు అనవసరంగా తప్పుడు ప్రచారం చేశాయని మంచు విష్ణు అసహనం వ్యక్తం చేశారు. ఆయన బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ ఫంక్షన్‌కు వచ్చారని.. తమ తండ్రి ఫోన్‌చేసి అల్పాహారం తీసుకునేందుకు ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే వచ్చారని స్పష్టం చేశారు. టికెట్ రేట్లతో పాటు, చాలా విషయాలు మాట్లాడుకున్నట్టు వివరించారు.