రాష్ట్ర ఆర్థిక స్థితి సంక్షోభంలో ఉందని సీఎం జగన్ అవాస్తవాలు చెబుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. లాక్డౌన్ విధించిన వారం రోజులకే ఆర్థిక పరిస్థితి క్షీణించిందని చేతులెత్తేశారని ఆరోపించారు. లాక్డౌన్తో పేదలు అల్లాడుతుంటే... అవేవీ పట్టనట్లు గత రెండు రోజుల్లో తనకి కావాల్సిన కాంట్రాక్టర్లకు రూ.6,400 కోట్ల బిల్లులు విడుదల చేశారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి ఉన్న డబ్బు ఉద్యోగస్తుల జీతాలిచ్చేందుకు లేదా.. అని లోకేశ్ ప్రశ్నించారు.
కరోనా ప్రభావంతో అల్లాడుతున్న పేదలకు రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించేందుకు సీఎం జగన్ మనసు ఒప్పటం లేదని ఆరోపించారు. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక, రవాణా సౌకర్యం లేక కన్నీరు పెడుతున్న రైతన్నని ఆదుకోవడం లేదని విమర్శించారు. ఉపాధి లేక, మూడు నెలల వేతన బకాయిలు విడుదల కాక ఉపాధి హామీ కూలీలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఉపాధి హామీ పథకంలో పనులు చేయించిన వైకాపా కార్యకర్తలకు రూ. 961 కోట్ల బిల్లులు విడుదల చేశారని ఆరోపించారు.