మద్యం ధరలను ప్రభుత్వం రికార్డుస్థాయిలో పెంచింది. 24 గంటల వ్యవధిలో రెండోసారి వడ్డించడం చరిత్రలో తొలిసారని అబ్కారీశాఖ అంటోంది. సోమవారం 25 శాతం, మంగళవారం మరో 50 శాతం పెంచేసింది. లాక్‌డౌన్ కన్నా ముందున్న ధరలతో పోలిస్తే కొన్ని రకాల మద్యం బ్రాండ్లపై గరిష్ఠంగా 109 శాతం, కనిష్ఠంగా 27.79 శాతం పెరిగాయి. 180 మిల్లీలీటర్లు ఉండే క్వార్టర్ ప్రామాణికంగా ప్రభుత్వం ఈ ధరలు పెంచింది. 999 పవర్‌స్టార్ ఫైన్ విస్కీ అనే రకం ఫుల్‌బాటిల్ ధర ఏకంగా 220 నుంచి 460 రూపాయలకు పెరిగింది. రోజర్‌బ్లాక్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ ఫుల్‌బాటిల్ ధర రూ. 2,590 నుంచి రూ.3,310 రూపాయలకు పెరిగింది. 330 మిల్లీలీటర్ల బీర్లపై 60 రూపాయలు, 650 మిల్లీలీటర్ల బీర్‌పై 90 రూపాయలు వడ్డించారు. గతేడాది తరహాలోనే ఈసారీ విక్రయాలు జరిగితే ప్రభుత్వానికి దాదాపు 15వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా.
ధర పెరిగినా.. జోరు తగ్గలేదు
ధరలు పెరిగినా..దుకాణాలు తగ్గినా.. మద్యం అమ్మకాల జోరు తగ్గడంలేదు. మందుబాబులు ఎగబడుతుండడం ఖజనాకు కోట్ల రూపాయల కిక్ ఇస్తోంది. రెండోరోజు కేవలం ఐదు గంటల్లోనే 27 కోట్ల రూపాయల మేర అమ్మకాలు జరిగాయి. ఆదాయం ఎలా ఉన్నా.. దుకాణాల వద్ద భౌతికదూరం మాత్రం పాటించడంలేదు.
ధరలు పెరిగినా మందుబాబులు మాత్రం రాజీపడడంలేదు. క్వార్టర్ కోసం ఎగబడుతున్నారు. కొత్త ధరలకు అనుగుణంగా విక్రయాలు నిర్వహించేందుకు మంగళవారం దుకాణాలు తెరవడం ఆలస్యమైనా మద్యం ప్రియులు తమ వంతు వచ్చేవరకూ వరుసలోనే వేచి చూశారు. ధరల సవరణ అనంతరం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అమ్మకాలు మొదలై రాత్రి 7గంటల వరకూ సాగాయి. సోమవారం 2,345 దుకాణాలు తెరవగా నిన్న కేవలం 1500 దుకాణాలేతెరుచుకున్నాయి. ఐనా ఐదు గంటల వ్యవధిలోనే 27 కోట్ల రూపాయల మేర విక్రయాలు జరిగాయి.
ఇదీ చదవండి : మరో 13 శాతం మద్యం దుకాణాలు తగ్గిస్తాం : సీఎం