Lepakshi Knowledge Hub land: లేపాక్షి భూములకు సంబంధించి హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ శాఖలో.. ఏపీఐఐసీ తాజాగా పిటిషన్ దాఖలు చేసింది. లేపాక్షి భూములను ఇందూ ప్రాజెక్ట్స్ దివాలా ప్రక్రియ నుంచి తొలగించాలని కోరింది. దివాలా ప్రక్రియ నిర్వహించే రిజల్యూషన్ ప్రొఫెషనల్ కానీ, దివాలా కంపెనీ గానీ, ఆ భూములతో ఎలాంటి వ్యవహారాలు జరపకుండా చూడాలని విన్నవించింది. ఆ భూముల్లోకి ప్రవేశించనీయవద్దని ఏపీఐఐసీ అభ్యర్థించింది. లేపాక్షి భూములను కూడా కలిపి ఇప్పటివరకూ దివాలా ప్రక్రియ జరిగినందున.. పూర్తిగా రద్దు చేయాలని అడిగింది. లేపాక్షికి సంబంధించిన భూమి ప్రజల ఆస్తి అని, దాన్ని కాపాడాల్సి ఉన్నందున.. దివాలా ప్రక్రియ నుంచి ఆ భూములను వేరు చేయాలంటూ రిజల్యూషన్ ప్రొఫెషనల్‌ను, ఇందూను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్ కాపీని ‘ఈనాడు- ఈటీవీ- ఈటీవీ భారత్’ సేకరించాయి.
ఎన్.సీ.టీ.ఎల్ ముందు ఏపీఐఐసీ వేసిన పిటిషన్: పిటిషన్‌లోని అంశాలను పరిశీలిస్తే... తమకేమీ తెలియదన్నట్లు అమాయకత్వం నటించినట్లు అర్థమవుతుంది. లేపాక్షి నాలెడ్జి హబ్ కంపెనీతో 2008 డిసెంబర్ 22న చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 8వేల 844 ఎకరాలు కేటాయించినట్లు ఆ పిటిషన్‌లో ఏపీఐఐసీ పేర్కొంది. అంతర్జాతీయ నాలెడ్జి హబ్ నిర్మించాలనే నిబంధనపై... లేపాక్షి సంస్థకు తమ ద్వారా ప్రభుత్వం భూములిచ్చినట్లు తెలిపింది. ఈమేరకు 2009 ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ అయినట్లు వివరించింది.
ఒప్పందం ప్రకారం లేపాక్షి సంస్థ 5 నుంచి పదేళ్లలో 8 నుంచి 10 వేల కోట్లు పెట్టుబడులుగా పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షన్నర మందికి ఉపాధి కల్పించాలని ఒప్పందం చేసుకున్నట్లు చెప్పింది. ఇతర ప్రయోజనాల కోసం ఆ భూములు ఉపయోగించరాదని, వేరే కంపెనీలు తాకట్టు పెట్టుకునేందుకు అనుమతించరాదని స్పష్టంగా చెప్పినట్లు ప్రస్తావించింది. కానీ ప్రభుత్వ ఉత్తర్వులు, భూకేటాయింపుల నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి... లేపాక్షి భూములపై ఇందూ సంస్థ ఇతర అవసరాల కోసం రుణాలు తీసుకున్నట్లు తెలిపింది.
2020 ఆగస్టులో రిజల్యూషన్ ప్రొఫెషనల్‌కు మెయిల్ పంపినట్లు వెల్లడి:ఇందూ దివాలా ప్రక్రియ మొదలైనట్లు వార్తల ద్వారా తెలుసుకుని... 2020 ఆగస్టులో రిజల్యూషన్ ప్రొఫెషనల్‌కు మెయిల్ పంపినట్లు ఏపీఐఐసీ చెప్పింది. భూములపై యాజమాన్య హక్కులను వదులుకోకుండానే.. తాము కూడా దివాలా ప్రక్రియలో పాల్గొనదల్చుకున్నట్లు అందులో తెలిపామంది. ఆ తర్వాత తమ హక్కుల్ని పూర్తిగా కాపాడుకునే లక్ష్యంతో దివాలా ప్రక్రియలో పాల్గొనలేదంది. ఇందూ దివాలా ప్రక్రియలో లేపాక్షి భూములు కూడా ఉన్నట్లు గత నెలలో ఒక దినపత్రికలో వచ్చిన వార్తల ద్వారా తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు నమ్మించేందుకు ఏపీఐఐసీ ప్రయత్నించింది. చట్ట ప్రకారం లేపాక్షి భూములపై ప్రభుత్వానికే హక్కు ఉందని తెలిపింది. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున ఆ భూములను దివాలా ప్రక్రియలో భాగంగా ఉంచరాదని పిటిషన్‌లో పేర్కొంది.