ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు పెద్దల సభలో చుక్కెదురయింది. విచక్షణాధికారంతో ఈ రెండు బిల్లులనూ సెలక్టు కమిటీకి పంపుతున్నట్లు శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ ప్రకటించటంతో అధికార వైకాపా సభ్యులు, మంత్రులు నిర్ఘాంతపోయారు.మరోవైపు తెదేపా సభ్యులు హర్షాతిరేకాలతో సభను హోరెత్తించారు. ఈ రెండు బిల్లులను సెలక్టు కమిటీకి పంపాలని తెలుగుదేశం పార్టీ కోరింది. నిబంధనలు అందుకు అనుమతించబోవని, సవరణలు ప్రతిపాదిస్తూ ప్రతిపక్షం ఇచ్చిన తీర్మానాన్ని చేపట్టనప్పుడు సెలక్టు కమిటీకి పంపే అవకాశం లేదని అధికారపక్ష సభ్యుల వాదించారు. కీలకమైన ఈ నిర్ణయంపై ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకోవాల్సి ఉన్నందున సెలక్టు కమిటీకి పంపాల్సిందేనని ప్రతిపక్ష తెదేపా పట్టుబట్టింది. అధికార పక్షమూ వెనక్కి తగ్గకపోవడంతో మండలిలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. దీంతో శాసనమండలి ఛైర్మన్ ఎం.ఎ.షరీఫ్ సభను సాయంత్రం 5.43 నిముషాలకు వాయిదా వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత అన్నిపక్షాల నాయకులను తన ఛాంబర్‌కు పిలిపించుకుని సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత రాత్రి 8.34 నిముషాలకు సభ తిరిగి ప్రారంభమైంది. తీవ్ర ఉత్కంఠ వాతావరణంలో మండలి ఛైర్మన్ షరీఫ్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. నిబంధన 154 ప్రకారం తన విచక్షణాధికారం మేరకు ఈ రెండు బిల్లులను సెలక్టు కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
అధికార వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు సెలక్టు కమిటీకి - crda bill news at council
మూడు రాజధానులకు బ్రేక్ పడింది. తెదేపా వ్యూహంతో అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు శాసన మండలిలో ఆమోదం లభించలేదు. తీవ్ర ఉత్కంఠ నడుమ ఛైర్మన్ షరీఫ్ ఈ బిల్లులను సెలక్టు కమిటీకి పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. బిల్లులను నెగ్గించుకునేందుకు సర్కార్ అన్ని విధాలా ప్రయత్నించినా విఫలం చెందింది.
మండలి ఛైర్మన్ ప్రకటన ఇదీ
‘మన ముందుకు చర్చకు వచ్చిన రెండు బిల్లుల గురించి మాట్లాడేందుకు మీ ముందుకొచ్చాను. ఈ బిల్లులపై చర్చ కోసమే మండలిని సమావేశపరిచాం. సభా వ్యవహారాల కమిటీ అజెండా ప్రకారం అనుకోకుండా నిబంధన 71 కింద తీర్మాన ప్రతిపాదన వచ్చింది. తర్జనభర్జనల అనంతరం.. ప్రభుత్వం, సభ్యుల సహకారంతో గౌరవప్రదమైన నిర్ణయం తీసుకున్నాం. నిబంధన 71 కింద చర్చతో పాటు ప్రభుత్వ బిల్లులను పరిగణనలోకి తీసుకున్నాం. అందువల్ల బిల్లుకు సవరణల విషయం, సెలక్టు కమిటీకి పంపే విషయమూ ప్రస్తావనకు రాలేదు. ఆ తర్వాత ప్రతిపక్ష సభ్యులు ఈ రెండు అంశాలపై నాకు లేఖ పంపారు. అవి పంపడం ఆలస్యమైంది. ప్రతిపాదన ఇచ్చామనే ఆలోచనతో వారు ఉన్నా ఆ విషయం రికార్డులకు ఎక్కలేదు. బిల్లుపై చర్చ అనంతరం ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు ఈ బిల్లును సెలక్టు కమిటీకి పంపాలని అడిగారు. సకాలంలో అది రాలేదని, ఆ సవరణ తీర్మానాన్ని చేపట్టలేదని, సాంకేతికంగా నిబంధనల ప్రకారం అది జరగలేదని అధికారపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశాలపై రెండున్నర గంటలపాటు వివిధ పక్షాల నేతలతో చర్చించాను. ప్రతిపక్ష తెదేపా తాము సవరణ తీర్మానాలు ఇచ్చామని, తమ వల్ల ఎలాంటి పొరపాటు జరగలేదని, వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని కోరింది. నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని అధికారపక్షం చెప్పింది. బిల్లు చేపట్టిన 12 గంటల్లోపు సవరణ ఇవ్వడం, అది పరిగణనలోకి తీసుకోవడం జరగలేదు. నిబంధనల ప్రకారం రాని ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోకూడదని భాజపా, పీడీఎఫ్ నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలి? దేనికి మొగ్గు చూపాలి? ఎలాంటి రూలింగు ఇవ్వాలని ఆలోచించాం. ఇప్పటికే కాలాతీతమైంది. ఆలోచనలతో కాలయాపన సరికాదనేది నా ఉద్దేశం. నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం వల్ల బిల్లులను సెలక్టు కమిటీకి పంపించే పరిస్థితి లేదు. అందువల్ల నేను ఛైర్మన్‌గా నాకున్న విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకుంటున్నాను. నిబంధన 154 ప్రకారం ఈ 2 బిల్లులను సెలక్టు కమిటీకి పంపిస్తున్నా’ అని ఛైర్మన్ ప్రకటించారు.
ఇదీ చూడండిసెలెక్ట్ కమిటీకి రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు