AP projects: రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు ప్రభుత్వం నీళ్లొదిలేసిన పరిస్థితి కనిపిస్తోంది. మూడేళ్లుగా ప్రతి వరద కాలంలో ఎక్కడోచోట జలాశయాల గేట్లు, కరకట్టలు కొట్టుకుపోతున్నాయి. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు ఆనకట్ట తెగిపోయి 33 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా... ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధులు ఇవ్వడంలో నిర్లక్ష్యం కొనసాగుతుండటం విషాదకరం. అన్నమయ్య ప్రాజెక్టు ప్రమాదం తర్వాత సీఎస్ ఆధ్వర్యంలో కమిటీని నియమించి అన్ని ప్రాజెక్టులపై అధ్యయనం చేయించి, వాటి భద్రతకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కానీ ప్రస్తుత వరద సీజన్‌లోనూ అదే నిర్లక్ష్యం. ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేట్ల మరమ్మతులకు నిధులివ్వకపోవడంతో బుధవారం రాత్రి మూడో నంబరు గేటు కింది భాగం దెబ్బతిన్నది. ప్రాజెక్టులోని నీరు వృథాగా పోతోంది. ప్రాజెక్టుల నిర్వహణపై వరద కాలానికి ముందే మేల్కొనడంలో నిర్లక్ష్యం, నిర్వహణకు నిధులివ్వాలన్న ఆలోచన చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణాలు.
కృష్ణా నదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టులో 16వ నంబరు గేటు 2021 ఆగస్టు 5 తెల్లవారుజామున 750 మీటర్ల దూరం కొట్టుకుపోయింది. టై ప్లాట్స్, గేటును ఎత్తేందుకు, దించేందుకు ఉపయోగించే తాళ్లు తెగిపోయాయి. బోల్టులు కూడా పూర్తిగా విరిగిపోయాయి. నిపుణులు పరిశీలించి, రెండేళ్లుగా గేట్ల నిర్వహణ, ఇతరత్రా సాధారణ అంశాలు కూడా పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తేల్చారు. అప్పట్లో తాత్కాలికంగా స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేసి, నీటిని నిల్వ చేసి పరిస్థితిని చక్కదిద్దారు. తర్వాత మరోసారి నిపుణుల కమిటీ సందర్శించి, 16వ నంబరు గేటుకు అటూ ఇటూ ఉన్న గేట్లకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. అధికారులు రూ.20 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఆ ఫైలు ముందుకూ వెనక్కూ కదలడంతో వరదల సీజన్ ప్రారంభమయ్యే సమయానికి కూడా పనులకు పాలనామోదం దక్కలేదు. ‘ఈనాడు’ కథనాల తర్వాత ఎట్టకేలకు 2022 జూన్ ప్రారంభంలో రూ.18.84 కోట్లతో పాలనామోదం ఇచ్చారు. జులై రెండో వారంలోనే వరదలు మొదలవడంతో ఆ పనులు పూర్తి కాలేదు.
నాలుగేళ్ల కిందట...
ఏలూరు జిల్లాలోని ఎర్రకాలువ జలాశయంలో గేట్లు ఎత్తేందుకు అధికారులు ప్రయత్నించగా అవి పని చేయలేదు. దీంతో దిగువన సర్‌ప్లస్ ఛానల్‌కు గండి పడింది. వేల ఎకరాలు ముంపులో చిక్కుకున్నాయి. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు మరమ్మతులు, నిర్వహణ పనులకు అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా నిధులు ఇవ్వలేదు. ఎట్టకేలకు 2022 జూన్‌లో ఆపరేషన్, నిర్వహణ నిధుల కింద రూ.69 లక్షలు మంజూరయ్యాయి. జలాశయం నుంచి నీటిని విడుదల చేసే ఆరు గేట్లకు మరమ్మతులు చేయిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. నాడు ఏ గేట్లు ఎత్తలేక సర్‌ప్లస్ ఛానల్‌కు గండి పడిందో అవి బాగు చేయలేదు. కొత్తవి ఏర్పాటు చేయలేదు. వర్షాలు తగ్గి, పంట కాలం పూర్తయితే తప్ప ఆ పనులేమీ చేయలేమని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.
వరద నియంత్రణలో అప్రమత్తత ఏదీ?
వరదల సమయంలో అప్రమత్తత చాలా కీలకం. చాలామంది అధికారులు అలాంటప్పుడు కూడా ప్రాజెక్టుల పర్యవేక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టులో అనేక మంది ఇంజినీర్లు పని చేస్తున్నా చాలా మంది స్థానికంగా నివాసం ఉండటం లేదని గతంలో ఉన్నతాధికారులు మెమోలిచ్చారు. కానీ ఫలితం లేకపోయింది.
* 2020లో కృష్ణా వరద నియంత్రణ అస్తవ్యస్తమయింది. తెలంగాణలో క్లౌడ్ బరస్ట్ (అతి భారీ వర్షాలు పడే అవకాశం) ఉందని వాతావరణశాఖ హెచ్చరించినా- అక్కడి నీరంతా కృష్ణా నది నుంచి దిగువకు వస్తుందని తెలిసినా సరిగా స్పందించలేదు. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 51 గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. వేల హెక్టార్లలో పంట దెబ్బతింది.
* 2020 ఆగస్టు, 2021 సెప్టెంబరు నెలల్లో శ్రీశైలం జలాశయం నిర్వహణ తీరుపై విమర్శలు వచ్చాయి. గతేడాది ఏడు గంటలపాటు ఏకంగా క్రస్ట్ గేట్లపై నుంచి నీరు వరదలా ప్రవహించింది. దీనివల్ల రేడియల్ గేట్లలో ఉండే హింజిస్ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమయింది. గేట్ల నిర్వహణ మాన్యువల్ సరిగా పాటించలేదు.
* 2021లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ హెచ్చరించినా అన్నమయ్య ప్రాజెక్టులో ఉన్న నీటిని సరైన సమయంలో సరైన రీతిలో దిగువకు వదలకపోవడం, గేట్ల నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే అవి కొట్టుకుపోయాయనే విమర్శలు ఉన్నాయి.
* సాధారణంగా 5వేల క్యూసెక్కుల ప్రవాహం రావడమే అరుదైన చిత్రావతి జలాశయానికి 2021లో అనూహ్యంగా 93 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. అధికారులు వరద ప్రవాహాన్ని సక్రమంగా పర్యవేక్షించుకుని, నీటిని సకాలంలో దిగువకు వదలడంతో ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు.
నిర్వహణకు నిధుల గండం
వందల టీఎంసీల నీటిని నిల్వ చేయాల్సిన జలాశయాలు, ప్రాజెక్టుల్లో కీలకమైన నిర్వహణ పనులను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మూడేళ్లుగా జరుగుతున్న ప్రమాదాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు కావాలంటూ ఎప్పటికప్పుడు కింది స్థాయి నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నా పట్టించుకున్న నాథుడే లేడని అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాటన్ బ్యారేజి లాంటి కొన్ని ప్రాజెక్టుల వద్ద చిన్న చిన్న పనులకు టెండర్లు పిలిచినా గుత్తేదార్లు ముందుకు రావడం లేదు. తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం జలాశయంలో చిన్నచిన్న బిల్లులు కూడా నెలల తరబడి చెల్లించకపోవడంతో గుత్తేదారులు పనులు నిలిపేసిన ఘటనలూ ఉన్నాయి.
* శ్రీశైలం జలాశయానికి 2009లో సామర్థ్యానికి మించి ఏకంగా 14.80 లక్షల క్యూసెక్కుల వరద మళ్లించాల్సి వచ్చింది. ఆ ధాటికి జలాశయంపై ఎంతో ప్రభావం కనిపించింది. శ్రీశైలం ప్రాజెక్టులో సుమారు రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో కీలక పనులు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించినా ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు.