హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కుంట శ్రీనివాస్‌కు కారు ఇవ్వడంతో పాటు హత్యకు వినియోగించిన రెండు కత్తులనూ బిట్టు శ్రీనివాస్ అనే వ్యక్తి సమకూర్చాడని పోలీసులు వెల్లడించారు. అతడు పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్‌కు మేనల్లుడు కావడంతో ప్రాధాన్యం సంతరించుకొంది. పుట్ట మధు తన తల్లి పేరిట నిర్వహిస్తున్న ట్రస్ట్ బాధ్యతల్ని ఇతడే చూస్తుంటాడు. కత్తుల్ని మంథనిలో ఓ పండ్ల దుకాణం నుంచి తీసుకొచ్చారనే వాదన వినిపిస్తోంది. ఆ దుకాణం ఓ ప్రజాప్రతినిధికి చెందినది కావడం గమనార్హం. ఆ ప్రజాప్రతినిధిని విచారిస్తే మరిన్ని విషయాలు బహిర్గతమవుతాయని తెలుస్తోంది. అయితే బిట్టు శ్రీనివాస్ ఇంకా తమకు చిక్కలేదని పోలీసులు ప్రకటించడంతో అతడు దొరికితే ఇంకెవరి ప్రమేయం ఉందో వెల్లడి కావచ్చని భావిస్తున్నారు. పుట్ట మధుకు సంబంధించి పలు విషయాల్లో న్యాయవాది వామన్‌రావు ఫిర్యాదులు, పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో తాజాగా బిట్టు శ్రీను పాత్రను పోలీసులు ఉటంకించడం సంచలనం రేకెత్తిస్తోంది.
ముగ్గురిని పట్టుకున్నాం: ఐజీ
ఈ జంటహత్యల కేసులో ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్టు చేసినట్లు గురువారం రాత్రి ఐజీ నాగిరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్‌లతో పాటు విలోచవరం గ్రామానికి చెందిన శివందుల చిరంజీవి కలిసి వామన్‌రావు దంపతులను చంపాలని పథకం వేసుకున్నారు. కుంట శ్రీనివాస్ తనకు తోడుగా కుమార్‌ను తీసుకెళ్లారు. వీరికి పుట్ట లింగమ్మ ఛారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్ మేనల్లుడైన తులిసెగారి శ్రీను అలియాస్ బిట్టు శ్రీను తన కారుతో పాటు కొబ్బరి బొండాలు నరికే రెండు కత్తులను సమకూర్చాడు. కారును చిరంజీవి నడపగా కుంట శ్రీను పక్కన కూర్చున్నాడు.
చిరంజీవిదే డ్రైవింగ్ పాత్ర...
వామన్‌రావు, నాగమణిల కంటే ముందుగానే చిరంజీవి వేగంగా కారు నడిపి కల్వచర్ల వద్ద కాపు కాశారు. అక్కడ రహదారి పనులు జరిగిన చోట వాహనాలు నెమ్మదిగా వెళ్తాయని భావించి అక్కడే వామన్‌రావు కారును అడ్డగించి అద్దాన్ని కత్తులతో బద్దలుకొట్టారు. డ్రైవర్ సతీష్ భయపడి కారు దిగి పారిపోయాడు. వామన్‌రావు వెంటనే డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కారు నడిపేందుకు ప్రయత్నిస్తుండగా కుంట శ్రీను అతన్ని బయటకు లాగి కత్తులతో పాశవికంగా దాడి చేశాడు. చిరంజీవి కారుకు రెండోవైపు నుంచి వచ్చి నాగమణిపై కత్తితో దాడిచేయగా ఆమె తీవ్ర గాయాలకు గురై కారు సీట్లోనే పడిపోయింది. తర్వాత చిరంజీవి కూడా వామన్‌రావు వద్దకు వచ్చి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనను అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు వీడియో తీశారు. వామన్‌రావును నీపై ఎవరు దాడి చేశారని అడిగితే కుంట శ్రీనివాస్‌తో పాటు మరొక వ్యక్తి అని చెప్పారు. దాడి అనంతరం కుంట శ్రీను, చిరంజీవి కారులో సుందిళ్ల బ్యారేజీ వైపు వెళ్లి అక్కడ రక్తపు మరకలంటిన దుస్తులను తీసేశారు. కత్తులను సుందిళ్ల బ్యారేజీలో పారవేశారు. అక్కడి నుంచి మహారాష్ట్రకు పారిపోతూ తెలంగాణ పోలీసులు తనిఖీ చేస్తున్నారనే అనుమానంతో ముంబయి మార్గానికి వెళ్తుండగా వాంకిడి- చంద్రపూర్ మధ్యలో పట్టుకున్నాం. మూడో నిందితుడైన అక్కపాక కుమార్ కారులో స్వగ్రామానికి వెళ్లగా మంథని పట్టణంలోనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన అనుమానితులను కూడా కస్టడీకి తీసుకొని దర్యాప్తు ముమ్మరం చేస్తాం’ అని ఐజీ తెలిపారు. ఈ సమావేశంలో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, డీసీపీ రవీందర్ పాల్గొన్నారు.